సీఎంఆర్ బియ్యం అక్రమ దారి మళ్లింపు..
- రైస్‌మిల్లర్‌పై పీడీ యాక్ట్
- రూ.15.70 కోట్ల నష్టం.. చర్లపల్లి జైలుకు తరలింపు
దండెపల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అక్రమంగా దారి మళ్లించి బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్‌మిల్లర్‌పై రామగుండం పోలీసులు పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. దండేపల్లి మండలం లింగాపూర్‌లోని ఎం/ఎస్ రామలక్ష్మణ్ ఇండస్ట్రీస్ రైస్‌మిల్ మేనేజింగ్ పార్ట్‌నర్ గంప సంతోష్‌కుమార్‌పై బ్లాక్‌మార్కెటింగ్ నిరోధక, నిత్యావసర వస్తువుల సరఫరా పరిరక్షణ చట్టం–1980లోని సెక్షన్ 3(1), 3(2) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
ప్రభుత్వంతో కుదుర్చుకున్న కస్టమ్ మిల్లింగ్ ఒప్పందాల ప్రకారం రబీ 2022–23, రబీ 2024–25 సీజన్లలో సంతోష్‌కుమార్ మొత్తం 9,244.206 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం పొందినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి 6,286.059 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,833.511 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించినట్లు గుర్తించారు.ఇంకా 4,452.548 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ప్రభుత్వానికి అందించాల్సి ఉందని, దానికి సమానమైన సుమారు 6,170.643 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అక్రమంగా దారి మళ్లించినట్లు కేసు దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ అక్రమాల వల్ల ప్రభుత్వానికి రూ.15.14 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. గత సీజన్ల సీఎంఆర్ బకాయిలను కలుపుకుని మొత్తం నష్టం రూ.15,70,36,726గా నిర్ధారించినట్లు వెల్లడించారు.సంతోష్‌కుమార్‌పై ప్రభుత్వ ధాన్యం దారి మళ్లింపునకు సంబంధించి 2025, 2026 సంవత్సరాల్లో మరో రెండు కేసులు కూడా నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. అవి దండేపల్లి, హాజీపూర్ పోలీస్‌స్టేషన్లలో నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా దారి మళ్లించడం వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
సీఎంఆర్ సరఫరాలో కొరత ఏర్పడితే పేదలు, అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ బియ్యం అందించే వ్యవస్థపై ప్రభావం పడుతుందని అన్నారు.గతంలోనూ నిందితుడిపై కేసులు నమోదైనప్పటికీ అక్రమ కార్యకలాపాలు కొనసాగించారని, సాధారణ క్రిమినల్ చట్టాల కింద తీసుకున్న చర్యలు నిరోధక ప్రభావం చూపలేదని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం దండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో సంతోష్‌కుమార్ రిమాండ్‌లో ఉన్నారని, బెయిల్‌పై విడుదలైతే మళ్లీ ఇదే తరహా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు నివేదించిన నేపథ్యంలో పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ వెల్లడించారు.పీడీ యాక్ట్ ఉత్తర్వులను లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్‌ఐ రాజవర్ధన్ లక్షెట్టిపేట సబ్‌జైలులో ఉన్న నిందితుడికి జైలు అధికారుల సమక్షంలో అందజేశారు. అనంతరం అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.ప్రభుత్వానికి చెందిన నిత్యావసర వస్తువులను అక్రమంగా దారి మళ్లించి బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
