పరామర్శ పేరుతో జగన్‌ది బలప్రదర్శనా?

  • విరూపాక్షిని పరామర్శించారా.. బలప్రదర్శన చేశారా?
  • ఆలూరు ఘటనపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: గుడిసె ఆది కృష్ణమ్మ
  • ‘జగన్‌–నెవర్‌ ఎగైన్‌’ అని ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కర్నూలు పర్యటనపై జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ తీవ్ర విమర్శలు చేశారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వచ్చిన జగన్‌.. పరామర్శ కంటే బలప్రదర్శనకే ప్రాధాన్యమిచ్చినట్లు కనిపించిందని ఆరోపించారు. ‘‘విరూపాక్షిని పరామర్శించడానికి వచ్చారా.. బలప్రదర్శన చేయడానికి వచ్చారా? అనే చర్చ కర్నూలు ప్రజల్లో జరుగుతోంది’’ అని అన్నారు.

కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు యాదవ్‌, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్రంసింఘ్‌, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ఆకెపోగు ప్రభాకర్‌, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు ధరూర్‌ జేమ్స్‌, కైప పద్మలతారెడ్డి తదితరులతో కలిసి శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పరామర్శకు ఇంత హడావుడి ఎందుకు?

విరూపాక్షిని నిజంగా పరామర్శించడమే జగన్‌ ఉద్దేశమైతే.. భారీగా పార్టీ శ్రేణులను సమీకరించి బలప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముందని ఆది కృష్ణమ్మ ప్రశ్నించారు. ముందుగానే పార్టీ నాయకులకు ఒక ‘స్క్రిప్ట్‌’ ఇచ్చి, గొడవలకు దారితీసేలా చేసి.. అనంతరం పరామర్శ పేరుతో బలప్రదర్శన చేయాలనే ఉద్దేశంతో జగన్‌ వ్యవహరించినట్లు కనిపిస్తోందని విమర్శించారు.

గత కొన్ని రోజులుగా పరామర్శల పేరుతో జనసమీకరణ చేపడుతూ.. తనకు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదనే సంకేతాన్ని ఇవ్వడానికి జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

‘జగన్‌–నెవర్‌ ఎగైన్‌’

2019 ఎన్నికల ముందు ‘ఒక్క ఛాన్స్‌’ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా నష్టపరిచారని ఆది కృష్ణమ్మ ఆరోపించారు.

అందుకే ప్రజలు ఇప్పుడు ‘జగన్‌–నెవర్‌ ఎగైన్‌’ అని స్పష్టంగా చెబుతున్నారని అన్నారు. ప్రజల తీర్పు ఇప్పటికే స్పష్టమైందని, అయినప్పటికీ భారీ జనసమీకరణల ద్వారా తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ఆలూరు ఘటనపై ఏకపక్షంగా మాట్లాడొద్దు

ఆలూరులో జరిగిన ఘర్షణకు సంబంధించిన పూర్తి వాస్తవాలను ప్రజలకు వివరించకుండా జగన్‌ ఏకపక్షంగా మాట్లాడటం సరికాదని ఆది కృష్ణమ్మ అన్నారు. జైలు వద్ద జగన్‌ చేసిన ప్రసంగంలో వాస్తవాల కంటే రాజకీయ ఆరోపణలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు.

ఆలూరు ఘటనలో ఎమ్మెల్యే అనుచరులు పెద్ద సంఖ్యలో షేకర్‌ యాదవ్‌పై దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనతో ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ భయాందోళనలో ఉన్నారని తెలిపారు.వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ‘జగన్‌ గూండాలా? మేమా?’ అంటూ రివర్స్‌ స్క్రిప్ట్‌ చదవడం తగదు’’ అని ఎద్దేవా చేశారు.

దళిత మహిళ ఇంటి ఘటనపై ప్రశ్నలు

ఎమ్మెల్యే దళిత మహిళ ఇంటికి వెళ్లి ఎస్సీ మహిళపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు స్పష్టంగా ఉన్నాయని ఆది కృష్ణమ్మ పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా వీడియోల్లో కనిపిస్తున్నాయని తెలిపారు.

అలాగే బోయ సామాజికవర్గానికి చెందిన మండల కన్వీనర్‌ వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనపైనా వాస్తవాలను ప్రజలకు వివరించకుండా తప్పుదోవ పట్టించేలా సమాచారం ప్రచారం చేయడం సరికాదన్నారు.

వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి

‘‘జగన్‌.. ఇకపై పర్యటనలకు వచ్చినప్పుడు ముందుగా స్థానికంగా పూర్తి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలి. పరామర్శ పేరుతో రాజకీయ బలప్రదర్శనలు చేయడం మానుకోవాలి’’ అని ఆది కృష్ణమ్మ సూచించారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి ఒక్కటే లక్ష్యమని అన్నారు. ప్రతిపక్షాలకు సైతం రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు.

చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే.. జగన్‌ మాత్రం రాజకీయంగా తన ఉనికిని చాటుకునేందుకు బలప్రదర్శనలకు దిగుతున్నారని ఆది కృష్ణమ్మ విమర్శించారు. సమావేశంలో జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు కె.ఇ.జగదీష్‌, రాష్ట్ర కార్పొరేషన్‌ డైరెక్టర్లు పోతురాజు రవికుమార్‌, విజయకుమార్‌, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్‌, రాష్ట్ర కురువ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వెంకటరాముడు, సత్రం రామకృష్ణుడు, పి.హనుమంతరావు చౌదరి, మంచాలకట్ట భాస్కర్‌రెడ్డి, మంద అఖిల్‌, సయ్యద్‌, డాక్టర్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.