Indio Gigante Chicken | నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న ఇండియో జిగాంటే
Indio Gigante Chicken | నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న ఇండియో జిగాంటే
‘డైనోసార్ వారసుడు’ అంటూ సరదా కామెంట్లు
ndio Gigante Chicken | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కోళ్లు సాధారణంగా ఒకటి నుంచి రెండు అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. అయితే బ్రెజిల్‌కు చెందిన ఓ ప్రత్యేక కోడి జాతి మాత్రం తన అసాధారణ ఎత్తు, భారీ ఆకృతితో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “ఇండియో జిగాంటే”గా పిలిచే ఈ అరుదైన కోడి జాతి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కోడి జాతిగా గుర్తింపు పొందిన ఇండియో జిగాంటే సాధారణంగా మూడు అడుగులకుపైగా ఎత్తు పెరుగుతుంది. కొన్ని కోళ్లు మరింత ఎత్తు పెరిగి చిన్నపాటి టర్కీ పక్షిని తలపిస్తాయి. పొడవాటి కాళ్లు, దృఢమైన శరీర నిర్మాణం, ఎత్తైన మెడ, రాజసంగా నడిచే తీరు ఈ జాతికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోల్లో ఈ కోడి ఇతర కోళ్ల మధ్య నిలబడితే దాదాపు రెట్టింపు ఎత్తులో కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “ఇది కోడి కాదు.. డైనోసార్ వారసుడు”, “కేఎఫ్‌సీ ఫైనల్ బాస్”, “కోళ్ల ప్రపంచానికి రాజు” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
పౌల్ట్రీ రంగంలోనూ ఇండియో జిగాంటేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జాతి కోళ్లను పెంచేందుకు పలు దేశాల్లో ఆసక్తి పెరుగుతోంది. అరుదైన జన్యు లక్షణాలు, ఆకర్షణీయమైన రూపం కారణంగా వీటి ధర కూడా సాధారణ కోళ్లతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అసాధారణ ఎత్తు, గంభీరమైన నడక, అరుదైన రూపురేఖలతో ఇండియో జిగాంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పక్షి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. కోళ్ల ప్రపంచంలో నిజంగానే “కోడి రాజు”గా ఈ జాతి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
