ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టంగా నిలబెట్టుకుని విజయానికి మరింత చేరువైంది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులకే పరిమితమైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఇంకా 536 పరుగులు వెనుకబడి ఉంది.
ప్రస్తుతం క్రీజులో ఓలీ పోప్ (24), హ్యారీ బ్రుక్ (15) ఉన్నారు. రేపటి మ్యాచ్‌లో భారత్ మరో 7 వికెట్లు పడగొడితే, 5 మ్యాచ్‌ల ఆండర్సన్-టెండూల్కర్ సిరీస్‌ను 1-1తో సమం చేయవచ్చు. అయితే, ఇంగ్లాండ్ తమ బజ్ బాల్ శైలితో అసాధ్యాన్ని ఛేదించగలదా లేదా డ్రాకు వెళ్తుందా అనేది చూడాలి. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.
కాగా, నేడు నాలుగో రోజు ఉదయం భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో గట్టి ఆధిపత్యాన్ని చూపించింది. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ క్రీజులోకి వచ్చి నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కరుణ్ నాయర్ (26) కూడా స్టార్ట్ ఇచ్చినా బ్రైడన్ కార్స్ బౌలింగ్‌కి దొరికిపోయాడు.
ఈ క్రమంలో కెఎల్ రాహుల్ (55) మరోసారి అర్ధశతకంతో మెరిశాడు. ఇక భారీ స్కోరు వైపు దూసుకెళ్తున్న సమయంలో జోష్ టంగ్ ఒక అద్భుతమైన డెలివరీతో రాహుల్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
అయితే ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ – రిషభ్ పంత్ జోడీ పటిష్ఠమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరిద్దరూ 4వవికెట్ కు 110 పరుగులు జోడించారు. పంత్ 58 బంతుల్లో 65 పరుగులతో తనదైన దూకుడు ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మరోవైపు గిల్ తన క్లాస్ ఆటతీరుతో రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరువు (161) శతకం కొట్టాడు. ఇంగ్లాండ్‌పై ఒకే టెస్టులో డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) చేసిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఇక టీ విరామం అనంతరం గిల్ – జడేజా కలిసి పరుగుల వర్షం కురిపించారు. గిల్ 161 పరుగులు చేసి బషీర్ చేతిలో ఔటయ్యాడు. జడేజా (69) నాటౌట్‌గా నిలవగా, వాషింగ్టన్ సుందర్ (12) మంచి సహకారం అందించాడు. ఈ నేపథ్యంలో భారత్ 600 పరుగుల ఆధిక్యత దాటగానే తన రెండో ఇన్నింగ్స్‌ను 607 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు వెంటనే దెబ్బతీశారు. సిరాజ్ రెండో ఓవర్‌లో జాక్ క్రాలీ (0)ని అవుట్ చేయగా, ఆకాష్ దీప్ తన స్పెల్‌తో డకెట్ (25), జో రూట్ (6)లను పెవిలియన్‌కి పంపాడు. ఫలితంగా ఇంగ్లాండ్ 50 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది.
ఇప్పుడు బరిలోకి ఉన్న పోప్ (24) – బ్రుక్ (15) జోడీపై ఆశలన్నీ పెట్టుకున్న ఇంగ్లాండ్‌కు… రేపు మనుగడ సాగించాలంటే అసాధారణ ప్రదర్శన అవసరం. అదే సమయంలో, భారతదేశం మరో ఏడు వికెట్లు తీసి ఎడ్జ్‌బాస్టన్ లో తొలి టెస్టు విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.