హరిత ఆలోచనలతో భావి తరాలను తీర్చిదిద్దాలి..
హరిత ఆలోచనలతో భావి తరాలను తీర్చిదిద్దాలి..
చిన్నప్పటి నుంచే పర్యావరణంపై అవగాహన ఉండాలి
ప్రకృతిపై మమకారంతోనే సమాజంపై బాధ్యత పెరుగుతుంది
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తే విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని సంరక్షించడం వంటి విలువలు బాల్యంలోనే అలవడితే సమాజం పట్ల బాధ్యతాభావం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ, ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ కల్చర్ కమిషన్, ఎన్.టి.ఆర్.జిల్లా అధికార యంత్రాంగం, కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, విజయవాడ. ఎ.పి.సర్వోదయ మండలి, రూట్ హెల్త్ ఫౌండేషన్, సర్వోదయ ట్రస్ట్, జి.ఆర్.కె.పోలవరపు కోటేశ్వరరావు సాంస్కృతిక సమితి, మార్పు వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 200 మంది ప్రఖ్యాత చిత్రకారులతో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

అదేవిధంగా పాఠశాల, కాలేజీ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, కాలుష్యం, నీటి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులు మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండటం, నీటిని పొదుపుగా వినియోగించడం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు.
ప్రకృతిపై మమకారం పెరిగినప్పుడే పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత ఏర్పడుతుందని, అలాంటి చైతన్యవంతులైన యువతతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి హరిత కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని, పరిశుభ్రమైన, పచ్చని పరిసరాల నిర్మాణానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ప్రతి సంస్థకు, వ్యక్తికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ పాల్గొని పర్యావరణ పరిరక్షణపట్ల మార్గనిర్దేశం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని అన్నారు.
ప్రకృతిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమేనని పేర్కొంటూ, పర్యావరణ పరిరక్షణను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ సునీత, డ్రీమ్ ఆర్ట్ అకాడమీ సెక్రెటరీ రమేష్, జీఆర్‌కే పోలవరపు సమితి అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు, మార్పు సంస్థ నుంచి తులసి పద్మశ్రీ, సర్వోదయ నుంచి రాంబాబు నాయుడు, మోతుకూరి వెంకటేశ్వరరావు, రూట్ హెల్త్ ఫౌండేషన్ విజయభాస్కర్, న్యాయవాది నరేంద్రకుమార్, కళాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
