డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి..
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి..
- మంచిర్యాల డీసీపీ భాస్కర్
- గంజాయి, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : నేటి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు బానిసలై తమ విలువైన భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రజలందరూ బాధ్యతగా పోలీస్ శాఖకు సహకరించాలని మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా, బెల్లంపల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్‌లో గురువారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డీసీపీ భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డీసీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీలు, ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ లింకులు, సోషల్ మీడియా మోసాల ఉచ్చులో పడొద్దని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద కాల్స్ లేదా లింక్‌లకు స్పందించవద్దని, ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని, వేధింపులు ఎదురైతే నిర్భయంగా ముందుకు రావాలన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర పనులు చేయవద్దని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి- రమేష్, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ మాట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను తడి, పొడి, పారిశుద్ధ్య, హానికారక చెత్తగా నాలుగు రకాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకే అందించాలన్నారు. మున్సిపాలిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నందున, ప్లాస్టిక్ రహిత ‘హరిత బెల్లంపల్లి’ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాలలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యానారాయణ, టూటౌన్ ఎస్ఐ సిహెచ్. కిరణ్ కుమార్, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
