కూటమి వైఫల్యాలపై వైసీపీ సమరభేరి
కూటమి వైఫల్యాలపై వైసీపీ సమరభేరి
‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ ఆవిష్కరించిన మల్లాది విష్ణు
సూపర్ సిక్స్ కాదు.. సూపర్ ఫెయిల్: మాజీ ఎమ్మెల్యే విమర్శ
రాష్ట్రంపై రూ.3.40 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆరోపణ
ఆంధ్రప్రభ, విజయవాడ: కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. “బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ”గా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా గురువారం సింగ్‌నగర్‌లోని తన కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో కలిసి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్‌ను మల్లాది విష్ణు ఆవిష్కరించారు. అనంతరం పోస్టర్లతో కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయని కూటమి ప్రభుత్వంపై నిరసనగా మేనిఫెస్టో ప్రతులను దహనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో అన్ని నియోజకవర్గాల టౌన్‌హాళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, గత ఐదేళ్ల జగన్ పాలనలో అమలైన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రంపై అదనంగా రూ.3,40,000 కోట్ల అప్పుల భారం పడిందని మల్లాది విష్ణు ఆరోపించారు. గతంలో అప్పులపై విమర్శలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైద్యం, విద్యా రంగాలు నిర్వీర్యం
బడ్జెట్ కేటాయింపులు లేకుండా అరకొర విధానాలతో ప్రభుత్వం నడుస్తోందని మల్లాది విష్ణు విమర్శించారు. ఆరోగ్యశ్రీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ‘నాడు-నేడు’ ద్వారా ఆధునికీకరించిన ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్నాయని అన్నారు. మెగా డీఎస్సీ ప్రకటనతో పాటు స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయ నియామకాల్లో కూడా అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.

సంక్షేమ పథకాలు, పెన్షన్లలో కోతలు
కరోనా కష్టకాలంలోనూ గత జగన్ ప్రభుత్వం డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.2.75 లక్షల కోట్లు పారదర్శకంగా బదిలీ చేసిందని మల్లాది విష్ణు గుర్తుచేశారు. ప్రతి పథకాన్ని పుస్తక రూపంలో ప్రజల ఇంటి ముందుకు తీసుకెళ్లి వివరించామన్నారు.కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏకంగా 6 లక్షల మందికి పెన్షన్లు తొలగించిందని మండిపడ్డారు. కొత్త పెన్షన్లు మంజూరు చేసే పరిస్థితి లేదని, గతంలో సచివాలయ వ్యవస్థ ద్వారా దరఖాస్తు చేసిన మరుసటి నెలలోనే పెన్షన్ అందించేవారమని తెలిపారు.
రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
రాష్ట్రంలో మొక్కజొన్న, వరి పండించే రైతులు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. రైతులు రోడ్లపైకి వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయమే దండగ అన్న రీతిలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

విజయవాడ సెంట్రల్‌లో బియ్యం మాఫియా
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ముఠాలు పేదల బియ్యాన్ని దోచుకుని అక్రమంగా అమ్ముకుంటున్నాయని మల్లాది విష్ణు ఆరోపించారు. నున్న పోలీస్ స్టేషన్ సమీపంలో బియ్యం లారీ పట్టుబడటమే దీనికి ఉదాహరణ అని అన్నారు. “ఇదేనా మీ సుపరిపాలన? బియ్యం దొంగతనాలే మీ మంచి పరిపాలనకు కేరాఫ్ అడ్రస్సా?” అని ఆయన ప్రశ్నించారు.
బుడమేరు వరద బాధితులకు అన్యాయం
బుడమేరు వరదల కారణంగా విజయవాడ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వం విఫలమైందని మల్లాది విష్ణు విమర్శించారు. మంత్రులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. బుడమేరు ఆధునీకరణకు రూ.500 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని, అన్ని రంగాల్లోనూ విఫలమైందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ప్రజల పక్షాన వైసీపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
