AP| తాడిపత్రిలో హై టెన్షన్…
మోహరించిన ఇరువర్గాలు
జెసి నివాసం వద్ద కార్యకర్తలు
పెద్దారెడ్డి ఇంటి వద్ద జోష్
పోలీసు బందోబస్తు
అనుమతి నిరాకరణ
AP| అనంతపురం బ్యూరో, ఆగస్టు 10(ఆంధ్రప్రభ) : డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ర్యాలీ కార్యక్రమాన్ని తాడిపత్రిలో పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటింటి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఆయన అనుచరులు వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇంటి వద్ద మకాం పెట్టారు. ఇరువర్గాల వారు ఎదురుపడితే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని పోలీసులు ఇరువురి కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు. భారీ సంఖ్యలో బలగాలను మోహరింపజేశారు.

తాడిపత్రి వైపు వెళుతున్న వాహనాలను తనిఖీ చేసి పంపిస్తున్నారు. ర్యాలీ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కావలసి ఉండగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తాడిపత్రిలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో తిరగడానికి అవకాశం లేదని ఆయన మినహాయిస్తే, ఎవరైనా తాడిపత్రిలో కార్యక్రమాలు చేసుకోవచ్చని జెసి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అనేక దౌర్జన్యాలు దుర్మార్గాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జెసి ప్రభాకర్ రెడ్డి స్వేచ్ఛగా తిరిగారని పెద్దారెడ్డి గుర్తు చేశారు. ఇందులో భాగంగానే తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయని తెలిపారు. దానివల్ల ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అయ్యారని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా హింసను ప్రేరేపించలేదన్నారు. వాహనాల తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఆ అనేక కేసుల్లో ఇరుక్కున్న ప్రభాకర్ రెడ్డి వాటిని ఎదుర్కోలేకపోతున్నారని అన్నారు.
