ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి..
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి..
గుంటూరు పీజీఆర్ఎస్‌ను పర్యవేక్షించిన ప్రధాన కార్యదర్శి
గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియను పర్యవేక్షించారు.
కలెక్టరేట్‌కు విచ్చేసిన ప్రధాన కార్యదర్శికి జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పీజీఆర్ఎస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన **‘రెవెన్యూ క్లినిక్’**ను జి. సాయి ప్రసాద్ స్వయంగా పరిశీలించారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిశీలిస్తూ, వాటి పరిష్కారంలో వేగం, పారదర్శకత, బాధ్యతాయుత విధానం పాటించాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ సేవలు నేరుగా ప్రజలకు చేరేలా చేయడంలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొని, రెవెన్యూ క్లినిక్‌లో జరుగుతున్న కార్యకలాపాలు, ఫిర్యాదుల పరిష్కార విధానంపై ప్రధాన కార్యదర్శికి వివరించారు.
