ఉపాధి హామీ నిధుల్లో వివక్షపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

నర్సంపేట, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ (ఈజీఎస్) నిధుల కేటాయింపులో వివక్ష చూపడం అనైతికమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచిన గ్రామాలకు ఈజీఎస్ నిధులను నిలిపివేయడం ఘోరమని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా నియోజకవర్గంలోని గ్రామాల్లో సర్పంచులు, ప్రజలు కష్టపడి పనులు చేస్తున్నారని తెలిపారు. లేబర్ కాంపోనెంట్ ద్వారా వచ్చిన నిధులతో పాటు మెటీరియల్ కాంపోనెంట్ కింద వచ్చే అభివృద్ధి నిధులను కేవలం కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలిచిన గ్రామాలకు మాత్రమే కేటాయించడం స్పష్టమైన వివక్షత అని ఆరోపించారు.

బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాలకు రావాల్సిన నిధులను ఇతర గ్రామాలకు మళ్లించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఉపాధి హామీ పనుల్లో గ్రామస్తులు చేసిన కష్టాన్ని పట్టించుకోకుండా, డివిజన్ యూనిట్ పేరుతో నిధులను మళ్లించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని అన్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల ప్రభావంలో అధికారులు వ్యవహరించడం సరికాదని, ఈ వివక్షతకు వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, ఈజీఎస్ అధికారులు వెంటనే స్పందించి అన్ని గ్రామాలకు సమన్యాయంగా నిధులు కేటాయించాలని, అభివృద్ధికి దోహదపడాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply