రైల్వే స్టేషన్‌లో భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహణ

రైల్వే స్టేషన్‌లో భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహణ
గుడివాడ – ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో గుడివాడ రైల్వే స్టేషన్‌లో గురువారం విస్తృత స్థాయి “భద్రతా అవగాహన మరియు అత్యవసర ప్రతిస్పందన ప్రదర్శన కార్యక్రమం” నిర్వహించారు. భారతీయ రైల్వే సివిల్ డిఫెన్స్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ప్రయాణికులు, రైల్వే సిబ్బందిలో భద్రతా చైతన్యం పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించారు. కార్యక్రమంలో అగ్నిమాపక భద్రత, ప్రథమ చికిత్స, సీపీఆర్/బీఎల్ఎస్, వడదెబ్బ నిర్వహణ, జనసమ్మర్థ నియంత్రణ, రక్షణ చర్యలు, విపత్తు నిర్వహణపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ (ఏఆర్టీ), మెడికల్ రిలీఫ్ వ్యాన్ (ఎంఆర్వీ) వినియోగంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా ఆధ్వర్యంలో, ఏడీఆర్‌ఎం పి.ఈ.ఎడ్విన్ పర్యవేక్షణలో నిర్వహించగా, సివిల్ డిఫెన్స్ అధికారులు, గుడివాడ స్టేషన్ మేనేజర్ డి.రమేష్, ఆర్‌పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది మరియు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో “గోల్డెన్ అవర్”లో ప్రాణరక్షణ చర్యలు చేపట్టే విధంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
