జింకల దాడులతో పంటలకు ముప్పు..
రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ వినతి
జింకల బెడద నుంచి పంటలను కాపాడాలని అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం డిమాండ్
ఊట్కూర్, ఆంధ్రప్రభ : రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ తహసీల్దార్ అశోక్‌కుమార్‌కు సంఘం ఆధ్వర్యంలో వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ఎల్కోటి చెన్నప్ప, మండల కార్యదర్శి అంజప్ప, ఏఐపీకేఎంఎస్ నాయకుడు సలీం మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులు గడిచినా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. అరకొర వర్షాలకు విత్తనాలు వేసిన రైతులు వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మండలంలోని పెద్దపొర్ల, కొల్లూరు, మల్లేపల్లి, యారఘాట్‌పల్లి తదితర గ్రామాల్లో జింకలు గుంపులుగా వచ్చి పత్తి, కంది పంటల మొలకలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఖరీఫ్ సాగు కూడా ఆలస్యంగా ప్రారంభమైందని పేర్కొన్నారు.
రైతు యాప్ ద్వారా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు సకాలంలో అందడం లేదని, ఎరువుల కొనుగోలుకు అవసరమైన బ్యాంకు రుణాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించి సబ్సిడీలను కొనసాగించాలని కోరారు.
రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించాలని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, కొనుగోలు పరిమితులు విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.
ఖరీఫ్ రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదని, ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లించడంతో పాటు గత బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వరి పంటను విక్రయించిన రైతులకు కొనుగోలు బిల్లులు, బోనస్ చెల్లింపులు పూర్తిగా జరగలేదని, కొన్ని చోట్ల తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు చిన్నబాలు, బాలకృష్ణ, నర్సింలు, రమేష్‌తో పాటు కొల్లూరు, పెద్దపొర్ల గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
