దుష్టశిక్షణ–శిష్టరక్షణ ధర్మాన్ని చాటిన దివ్య విహారం

దుష్టశిక్షణ–శిష్టరక్షణ ధర్మాన్ని చాటిన దివ్య విహారం

  • నారాయణవనంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా..
  • గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం

నారాయణవనం, ఆంధ్రప్రభ : నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం సింహవాహనంపై సుదర్శన నరసింహుడి అలంకారంలో శ్రీనివాసుడు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

అనంత తేజోమూర్తిగా వెలసిన స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ ధర్మాన్ని చాటిచెప్పారు. పరాక్రమం, ధైర్యం, తేజస్సు, ఆధిపత్యానికి ప్రతీకైన సింహరూప దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయారు.

వాహనం ముందు భక్త బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో గోవింద నామస్మరణ చేస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి కటాక్షాన్ని పొందారు. సింహవాహనోత్సవం ద్వారా అజ్ఞానాన్ని తొలగించి ధర్మమార్గంలో నడవాలని, విజయస్ఫూర్తితో జీవించాలని శ్రీవారు సందేశమిచ్చారు.

ఈ రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహనసేవలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply