Creatinine Test | ఈ ఒక్క పరీక్షను వదిలేస్తే ప్రమాదమే

కిడ్నీల ఆరోగ్యానికి ఇదే కీలకం!

Creatinine Test | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నప్పుడు రిపోర్టులో ‘క్రియాటినిన్ (Creatinine)’ ఎక్కువగా ఉందని దీని వల్ల కిడ్నీలు దెబ్బతింటాయని డాక్టర్లు చెబుతూ ఉండటం వింటూ ఉంటాం.. అయితే అసలుఈ క్రియాటినిన్‌ శరీరంలో ఎదుకు ఎక్కువ అవుతుంది. దీని స్థాయిలు పెరిగితే కిడ్నీలు దెబ్బతిన్నట్లేనా? అసులు ఈ క్రియాటినిన్‌ అంటే ఎంటి అనే ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. వాస్తవానికి కిడ్నీల పనితీరును అంచనా వేయడంలో క్రియాటినిన్ పరీక్ష కీలక పాత్ర పోషిస్తుంది.

క్రియాటినిన్ అంటే ఏమిటి?

క్రియాటినిన్ అనేది మన శరీరంలోని కండరాలు పనిచేసే సమయంలో సహజంగా ఏర్పడే వ్యర్థ పదార్థం. ఇది రక్తంలోకి చేరిన తర్వాత కిడ్నీలు దానిని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అందువల్ల రక్తంలో క్రియాటినిన్ స్థాయిని బట్టి కిడ్నీలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని వైద్యులు అంచనా వేస్తారు.

క్రియాటినిన్ పరీక్ష ఎందుకు చేస్తారు?

సాధారణంగా ఈ పరీక్షను రక్త నమూనా (Serum Creatinine) ద్వారా నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో మూత్ర పరీక్ష కూడా చేస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ‘ఈజీఎఫ్‌ఆర్‌ (Estimated Glomerular Filtration Rate)’ ను లెక్కించి కిడ్నీల పనితీరును మరింత స్పష్టంగా అంచనా వేస్తారు.

శరీరంలో క్రియాటినిన్ పెరిగితే..
క్రియాటినిన్ స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీలు వ్యర్థాలను సరిగా ఫిల్టర్ చేయడం లేదనే సంకేతం. అయితే ప్రతి సందర్భంలోనూ అది తీవ్రమైన కిడ్నీ వ్యాధినే సూచిస్తుందని అనుకోవద్దు. శరీరంలో నీటి కొరత, కొన్ని మందుల వాడకం, తీవ్రమైన వ్యాయామం వంటి కారణాల వల్ల కూడా తాత్కాలికంగా పెరగవచ్చ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే క్రియాటినిన్‌ స్థాయి శరీరంలో ఈ కింది స్థాయిలను సాధారణంగా పరిగణిస్తారు.

పురుషులు: 0.74 నుంచి 1.35 mg/dL
మహిళలు: 0.59 నుంచి 1.04 mg/dL

రిపోర్టులో ఈ విలువలు ఎక్కువగా కనిపిస్తే వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

అసలు ఎవరు క్రియాటినిన్‌ పరీక్ష చేయించుకోవాలి..

  • మధుమేహం ఉన్నవారు
  • అధిక రక్తపోటు ఉన్నవారు
  • ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు
  • కుటుంబంలో కిడ్నీ వ్యాధుల చరిత్ర ఉన్నవారు
  • ఎక్కువకాలం కొన్ని మందులు వాడుతున్నవారు

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలంటే..

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీరు తాగడం మంచింది. అలాగే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. రక్తపోటు, షుగర్‌ను నియంత్రణలో ఉంచాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా మంచింది. డాక్టర్ల సలహా లేకుండా అలాగే అవసరం లేకుండా నొప్పి నివారణ మందులు వాడకూడదు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిరంతరం చేయించుకోవాలి.

క్రియాటినిన్ పరీక్ష ఒక చిన్న రక్త పరీక్షే అయినప్పటికీ, కిడ్నీల ఆరోగ్యాన్ని ముందుగానే అంచనా వేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మధుమేహం, బీపీ వంటి సమస్యలు ఉన్నవారు ఈ పరీక్షను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా చేయించుకుంటే కిడ్నీ సంబంధిత సమస్యలను ముందే గుర్తించి చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మీ రిపోర్టులో క్రియాటినిన్ స్థాయిలు సాధారణానికి భిన్నంగా ఉంటే స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించండి.