25 అడుగుల లోతులోకి దూసుకెళ్లిన బస్సు.. ఐచర్‌ లారీ

బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు

అనంతపురం ప్రతినిధి (ఆంధ్రప్రభ): హైదరాబాద్‌ నుంచి ప్రయాణికులతో బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, ఐచర్‌ వాహనం పరస్పరం ఢీకొని పొగరూరు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయాయి. ఈ ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులతో పాటు రెండు వాహనాల డ్రైవర్లు గాయపడ్డారు. వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొనడంతో బ్రిడ్జి పైనుంచి సుమారు 25 అడుగుల లోతులో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరికొందరు స్వల్ప గాయాలతో చికిత్స అనంతరం తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. వాహనాలు భారీ ప్రమాదానికి గురైనప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పామిడి, పెద్దవడుగూరు పోలీసులు సంయుక్తంగా ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.