తిరుపతిలో దారుణం..

తిరుపతిలో దారుణం..


ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ బాలికపై లైంగిక దాడి

  • కేసు నుంచి తప్పించేందుకు సహకరించిన మహిళా అధికారిణి అరెస్ట్
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు
  • జీరో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీసుల చర్యలు
  • మైనర్లపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

తిరుపతి క్రైం, ఆంధ్రప్రభ: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన మహిళా అధికారిణిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలి పిన్ని భర్త అయిన రామ్మూర్తి (51) తిరుపతిలో జీఎస్టీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడు బాధిత బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తిరుపతిలోని తన నివాసంలోనే కాకుండా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి కూడా బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు.

బెదిరింపులు
బాధితురాలితో ఫోన్, చాట్ యాప్‌ల ద్వారా జరిపిన సంభాషణలు, కలిసి దిగిన ఫోటోలను ఆధారంగా చేసుకొని, తన వద్దకు రాకపోతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించినట్లు వెల్లడైంది. ఈ విషయం ఎవరితోనైనా చెబితే ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్రంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అక్కడ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అనంతరం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి భక్తవత్సలం కేసును లోతుగా దర్యాప్తు చేసి కీలక ఆధారాలను సేకరించారు.

ఇద్దరు కీలక నిందితులు
దర్యాప్తులో ప్రధాన నిందితుడికి సహకరించిన బాధితురాలి పిన్ని మానస, డిప్యూటీ తహసీల్దార్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇద్దరినీ మే 21 సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మైనర్ బాలలపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్, బెదిరింపుల వంటి ఘటనలను దాచిపెట్టకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తిరుపతి పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా లేదా చాట్ యాప్‌ల ద్వారా ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడకుండా తల్లిదండ్రులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. మైనర్ బాలల రక్షణకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, బాధితుల గోప్యతను పరిరక్షిస్తూ నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Leave a Reply