ఫిట్ శ్రీకాకుళంకు మనం సిద్ధం అవ్వాలి

ఫిట్ శ్రీకాకుళంకు మనం సిద్ధం అవ్వాలి

  • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా స్పూర్తితో.. ఫిట్ శ్రీకాకుళం సాధించడానికి అందరూ సమాయత్తం అవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద ఎంపీ కప్ 2026 బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. టోర్నీ లోగోను ఆవిష్కరించారు .. క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంతకుముందు.. టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా స్నేహపూర్వక మ్యాచ్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఇంచార్జ్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి లు జట్లుగా విడిపోయి క్రికెట్ ఆడారు.

సుమారు గంట సేపు పాటు క్రికెట్ ఆడి.. అక్కడి వారిలో కేంద్ర మంత్రి ఉత్సాహం నింపారు. ఎంపీ కప్ బాక్స్ క్రికెట్ టోర్నీ ఈ నెల 30వ తారీఖు వరకు జరుగుతుందని, యువత సెల్ ఫోన్ లను వదలి వ్యాయామం వైపు దృష్టి సారించాలనే ఉద్దేశ్యంతోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా నినాదానికి స్పూర్తిగా.. ఫిట్ శ్రీకాకుళం కు మనమంతా సిద్ధమవ్వాలని రామ్మోహన్ నాయుడు కోరారు. నేటి యువత తమ దైనందిన జీవితంలో ఏదో ఒక క్రీడను అలవాటు చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి సాధించాలంటే.. అందరూ ఆరోగ్యంగా ఉండాలని.. అందుకు క్రీడలు, వ్యాయామం తోడ్పాటునిస్తాయని అన్నారు. ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా జరుగుతున్న ఈ ఎంపీ కప్ క్రికెట్ టోర్నీ విజయవంతం అవ్వడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో రెవెన్యూ, పోలీసు అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply