ఓటర్లకు చేరని ఎస్‌ఐఆర్ నోటీసులు.. పంపిణీలో తీవ్ర జాప్యం
ఆఫీసుల్లోనే 23.76 లక్షల నోటీసులు
మార్కాపురంలో అత్యధికంగా 91 శాతం పెండింగ్
70 శాతం దాటిన ఏడు జిల్లాలు
నోటీసుల జనరేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి
పంపిణీపైనే అధికారుల ప్రధాన దృష్టి
అమరావతి, ఆంధ్రప్రభ: ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ, పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. పంపిణీ ప్రక్రియలో భారీగా పెండింగ్ నమోదైంది. ఆగస్టు 16 నాటికి రాష్ట్రంలో 44,25,059 నోటీసులు జనరేట్ చేయాల్సి ఉండగా 44,13,864 నోటీసులను అధికారులు జనరేట్ చేశారు. కేవలం 11,195 నోటీసులు మాత్రమే జనరేట్ చేయాల్సి ఉంది. దీంతో నోటీసుల జనరేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయినప్పటికీ, వాటిని సంబంధిత ఓటర్లకు చేర్చడంలో మాత్రం ఇంకా గణనీయమైన పురోగతి సాధించాల్సి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 20,37,099 నోటీసులు ఓటర్లకు అందించారు. మరో 23,76,765 నోటీసులు పంపిణీ చేయాల్సి ఉంది. మొత్తం పెండింగ్ 53.85 శాతంగా ఉంది. అంటే జనరేట్ చేసిన నోటీసుల్లో సగానికిపైగా ఇంకా సంబంధిత వ్యక్తులకు చేరలేదు. రోజువారీగా పెద్ద సంఖ్యలో నోటీసులు పంపిణీ చేస్తున్నప్పటికీ పెండింగ్ సంఖ్య కూడా భారీగానే ఉండటం అధికారులకు సవాలుగా మారింది.
మార్కాపురంలో అత్యధికం.. నోటీసుల పంపిణీ పెండింగ్
మార్కాపురం జిల్లా 91.56 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 1,69,223 నోటీసులు జనరేట్ చేయగా కేవలం 14,284 మాత్రమే పంపిణీ అయ్యాయి. మరో 1,54,939 నోటీసులు అందించాల్సి ఉంది. విశాఖపట్నంలో 86.97 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 83.75 శాతం, బాపట్లలో 78.89 శాతం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 74.79 శాతం, పార్వతీపురం మన్యంలో 71.31 శాతం, తూర్పుగోదావరిలో 71.07 శాతం నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి.
70 శాతం దాటిన ఏడు జిల్లాలు
పంపిణీ పెండింగ్ 70 శాతానికి మించిన జిల్లాలు ఏడు ఉన్నాయి. మార్కాపురం, విశాఖపట్నం, శ్రీ సత్యసాయి, బాపట్ల, నెల్లూరు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయా జిల్లాల్లో నోటీసులు పంపిణీని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
మరోవైపు కొన్ని జిల్లాలు నోటీసులు పంపిణీలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. అనకాపల్లిలో కేవలం 1.29 శాతం నోటీసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఏలూరులో 2.70 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10.62 శాతం, పోలవరంలో 10.83 శాతం, కర్నూలులో 22.28 శాతం, గుంటూరులో 23.39 శాతం, నంద్యాలలో 24.26 శాతం పెండింగ్ ఉంది. ఈ జిల్లాలు 25 శాతంలోపు పెండింగ్‌తో మెరుగైన స్థితిలో ఉన్నాయి.
నోటీసుల జనరేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయింది
ఐదు జిల్లాల్లో 40కి పైగా బీఎల్‌ఓలతో సంప్రదింపుల అభ్యర్థనల్లో వైఎస్సార్ జిల్లాలో 60 పెండింగ్‌తో అత్యధికంగా ఉంది. పల్నాడులో 45, శ్రీ సత్యసాయిలో 41, అన్నమయ్యలో 41, నెల్లూరు జిల్లాలో 40 అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో పెండింగ్ సంఖ్య తక్కువగా ఉంది.
పంపిణీపైనే ప్రధాన దృష్టి
నోటీసుల జనరేషన్ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరడంతో ఇక వాటి పంపిణీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 23.76 లక్షల నోటీసులు ఇంకా పంపిణీ కావాల్సి ఉండటంతో బీఎల్‌ఓల పనితీరు, రోజువారీ పంపిణీ పురోగతిని జిల్లాల వారీగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. అధిక పెండింగ్ ఉన్న జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వీలైనంత త్వరగా నోటీసులను ఓటర్లకు అందించడమే తదుపరి లక్ష్యంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో మాత్రమే నోటీసుల జనరేషన్ ఇంకా మిగిలి ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 9,164, వైఎస్సార్ జిల్లాలో 1,651, శ్రీకాకుళంలో 216, విశాఖపట్నంలో 164 నోటీసులు జనరేట్ చేయాల్సి ఉంది. మిగిలిన జిల్లాల్లో లక్ష్యానికి అనుగుణంగా నోటీసుల జనరేషన్ పూర్తయింది.
బీఎల్‌ఓలతో సంప్రదింపుల్లో 621 పెండింగ్
‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌ఓ’ కార్యక్రమంలోనూ రాష్ట్రవ్యాప్తంగా 98,262 అభ్యర్థనలు నమోదయ్యాయి. వీటిలో 94,987 అభ్యర్థనలకు అధికారులు స్పందించారు. ఇంకా 621 అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 445 అభ్యర్థనలు 48 గంటల్లోపు ఉండగా.. 176 అభ్యర్థనలు 48 గంటలు దాటినవిగా ఉన్నాయి.
