అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం..

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం..
ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపిల్లల వివాహాల సమయంలో పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందన్నారు.
సాధారణ కుటుంబాలకు ఈ పథకాలు గొప్ప వరమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్లు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
