ఫార్మా సిటీ అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

ఇద్దరు కార్మికుల మృతిపై సంతాపం

బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆదేశం

అమరావతి, ఆంధ్రప్రభ: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీ సంస్థలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడంపై సీఎం సంతాపం తెలిపారు.

ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, ప్రమాదం జరిగిన తీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరో అగ్నిమాపక శకటం ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సీఎం అధికారులకు సూచించినట్లు సమాచారం.