SIR Review Telangana | ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి

SIR Review Telangana | ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి

SIR Review Telangana | నకిలీ ఓటర్ల ఏరివేత పేరుతో అసలైన వారిపై అనుమానాలు
పోలింగ్ బూత్ల వారీగా బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ
ఓటర్ల నమోదులో పార్టీ శ్రేణులకు కీలక బాధ్యతలు
జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా వేగంగా సాగుతున్న ప్రక్రియ
ఓటర్ల జాబితాపై తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి

SIR Review Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: నకిలీ ఓటర్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ స్థాయిలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (ఎస్ఐఆర్)పై భారత రాష్ట్ర సమితి ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ ఓటర్లను తొలగించే క్రమంలో అసలైన, నిజమైన ఓటర్లకు నష్టం జరగకుండా ఉండేందుకు బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించి ఇబ్బందులకు గురి చేసే అవకాశముందని అనుమానిస్తున్న బీఆర్ఎస్ పోలింగ్ బూతుల వారీగా ఓటర్లను అప్రమత్తం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది.

బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వచ్చే నెల రోజుల ముందే ప్రతి ఓటరు వివరాలను సేకరించి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నాయకులను, కార్యకర్తలను మోహరించి ఓటర్ల జాబితాలో అర్హులైన వారి పేర్లు ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం రూపొందిస్తున్న ఓటర్ల జాబితా త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు ఉపయోగించే అవకాశం ఉండడంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన కార్పొరేటర్లుగా టికెట్ ఆశిస్తున్న నాయకులు తమ మునిసిపల్ డివిజన్‌లో ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొంటున్నారు.

హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించిన ఓటర్ల నమోదు ప్రక్రియను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఓటర్ల నమోదు సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి నమోదు చేసే వివరాలను బీఆర్ఎస్ ముందస్తుగానే సేకరించి సిద్ధం చేస్తోంది. ఇందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల సంఘం సిద్ధం చేసిన ప్రశ్నావళిని ముద్రించి వాటిని బూత్ స్థాయి బాధ్యులకు అప్పగించారు. వారు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల వివరాలను నమోదు చేస్తున్నారు.

2002, 2024 సంవత్సరాల్లో ఉన్న ఓటర్ల జాబితాలను తీసుకెళ్లి అందులో పేర్లున్నాయా? ఒకవేళ వారు ఇళ్లు మారితే ఎక్కడికి వెళ్లారు? వారి చిరునామా, ఫోన్ నెంబర్ వివరాలను తీసుకుని వారు ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లో ఓటు వేసేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. అక్కడున్న బీఆర్ఎస్ నాయకులకు వివరాలు పంపించి ఓటర్ల జాబితాలో వారికి అవకాశం ఉండేలా చూడాలని కోరుతున్నారు.

పోలింగ్ బూత్ల వారీగా ఇన్‌చార్జ్

సనత్‌నగర్ నియోజకవర్గంలో ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం నకిలీ ఓటర్లను ఏరివేసే క్రమంలో అసలైన వారిని తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగే సమయంలో ఆయా బూత్ ఇన్‌చార్జ్‌లు కూడా వెళ్లి ఓటర్ నమోదులో కీలకంగా పని చేయాలని కోరారు.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకులు ఇప్పటి నుంచే ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి సిద్ధంగా ఉండాలని కోరారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో మొదలైన ఎస్ఐఆర్ ప్రక్రియ రెండురోజుల వ్యవధిలోనే ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుకుగా, సమర్థవంతంగా పాల్గొన్న వారికే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసే అవకాశం ఇస్తామని కూడా కేటీఆర్ ప్రకటించారు.

ఒకవైపు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొంటూనే మరోవైపు ఓటర్ల నమోదులో పార్టీ యంత్రాంగం తలమునకలు కావాలని పార్టీ ఆదేశించింది. ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూపై బీఆర్ఎస్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో రాజకీయ వేడి రగులుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఓటర్ల జాబితా సవరణ అంశం చర్చనీయాంశమైంది.

ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఆర్ఎస్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదులో అసమానతలు, పట్టణ ప్రాంతాల్లో భారీ మార్పులు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో ఓటర్ల జాబితా అంశం పలుమార్లు వివాదాస్పదమైంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేలాది మంది ఓటర్ల పేర్లు జాబితాలో కనిపించలేదని ఆరోపణలు వచ్చాయి.

ఇప్పుడు మరోసారి ప్రత్యేక సమీక్ష ప్రారంభం కావడంతో అన్ని పార్టీల కన్నా ముందు బీఆర్ఎస్ అప్రమత్తమైంది. అధికార యంత్రాంగం ప్రభావంతో ఎన్నికల ప్రక్రియను మలుపు తిప్పే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ నేతలు దుయ్యబడుతున్నారు. పట్టణ నియోజకవర్గాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓటర్ల తొలగింపులు అధికంగా జరుగుతున్నాయనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. అపార్ట్‌మెంట్లు, అద్దె ఇళ్లు, ఉద్యోగాల కోసం తరచూ మారే యువత పేర్లు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ఆ పార్టీ అంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొత్త నమోదులు వేగంగా జరుగుతున్నాయంటూ అసమానతలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Leave a Reply