PESA Act | పెసా చట్టంతో గ్రామసభలకు పెరిగిన అధికారాలు

PESA Act | పెసా చట్టంతో గ్రామసభలకు పెరిగిన అధికారాలు
PESA Act | జింగనూర్ గ్రామసభ విజయగాథ.. అటవీ హక్కులపై గిరిజనుల ఆధిపత్యం
అటవీ ఉత్పత్తుల ద్వారా గ్రామాలకు భారీ ఆదాయం
పెసా సూచికలతో రాష్ట్రాల పనితీరుపై పర్యవేక్షణ
గ్రామసభల డిజిటల్ డాక్యుమెంటేషన్‌కు ప్రాధాన్యం
PESA Act | మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జింగనూర్ గ్రామ పంచాయతీలోని 7 పెసా గ్రామాలు అటవీ పరిపాలన నియమాలను నిశ్శబ్దంగా తిరగరాస్తున్నాయి. పుల్లిగూడెం, జింగనూర్ మాల్, జింగనూర్ చెక్-1, జింగనూర్ చెక్-2, వడదేలి, యెడ్సిలి, మంగిగూడెంలలోని 2,885 మంది నివాసితులలో 2,152 మంది షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు. వీరంతా తమ తునికాకు వ్యాపారంపై పూర్తి నియంత్రణను సాధించారు. తరతరాలుగా ఈ వర్గాలు తునికాకును సేకరిస్తున్నప్పటికీ, వాటి లాభాలు వేరే వాళ్లకి దక్కేవి. కానీ, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియా (పెసా) చట్టం ద్వారా లభించిన అధికారాలతో, జింగనూర్ ఉమ్మడి గ్రామసభ ఈ పరిస్థితిని మార్చివేసింది.
మహారాష్ట్రలో జింగనూర్ కథ ఒక్కటే కాదు. తూర్పు విదర్భలోని 1,400 కంటే ఎక్కువ గ్రామాలు అటవీ ఉత్పత్తులపై తమ హక్కులను చాటుకున్నాయి. ఇవి ఆర్థిక సంఘం గ్రాంట్ల కంటే ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ ఆదాయాన్ని గ్రామసభకు సమకూర్చుకుంటున్నాయి. అధికారమున్న గ్రామసభ పాలన, ఆదాయం రెండింటినీ చేయగలదని నిరూపిస్తున్నాయి.
పెసా చట్టం 1996 డిసెంబర్ 24న అమలులోకి వచ్చింది. ఇది గ్రామసభను ఒక సహజమైన గ్రామ నివాసంగా, సంప్రదాయ సభగా గుర్తించింది. మహాభారతం, బుద్ధుని దీఘ-నికాయ రెండూ గ్రామసభను సరైన స్వయంపాలన రూపంగా పేర్కొన్నాయి.
పెసా అమలులోకి వచ్చిన సరిగ్గా 30 ఏళ్ల తర్వాత, 2025 డిసెంబర్ 24న జరిగిన పెసా మహోత్సవంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ “పెసా సూచికల” ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. ఈ 100 పాయింట్ల అంచనా సాధనం 10 అంశాలను కవర్ చేస్తుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టాలు పెసాతో ఏకీభవించడం, రాష్ట్ర పెసా నిబంధనల నాణ్యత, రెవెన్యూ, మైనింగ్ మరియు అటవీ చట్టాలకు సవరణలు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల అప్లోడ్, పెసా కోఆర్డినేటర్ల నియామకం, శిక్షణ, గ్రామసభల అవగాహన, గ్రామసభ కార్యకలాపాల డిజిటల్ డాక్యుమెంటేషన్. ఇది అన్ని పెసా రాష్ట్రాలతో చర్చించిన తర్వాత రూపొందించారు.
ఈ ఫ్రేమ్‌వర్క్‌లో రెండు అంశాలు ముఖ్యమైనవి. వాటిలో రాష్ట్ర రెవెన్యూ, మైనింగ్, అటవీ చట్టాలు పెసాతో అనుగుణంగా మారాయా? లేదా? అనేది మొదటిది. మహారాష్ట్ర పెసా నియమాలు-2014లోని రూల్ 13 గ్రామసభలకు స్వతంత్ర వేలం నిర్వహించుకునే అధికారం ఇవ్వడం వల్లే జింగనూర్లో వేలం విజయవంతమైంది. చట్టపరమైన సమన్వయాన్ని ఒక కొలమానంగా మార్చడం వల్ల, ఇది తప్పనిసరి అనే సందేశం వెళ్తుంది.
రెండోది, గ్రామసభ సమావేశాల ఫోటోలు, వీడియోలు, సమావేశ వివరాలు “పంచాయతీ నిర్ణయ్” పోర్టల్‌లో అప్లోడ్ చేయడం. రికార్డులు ఉన్న గ్రామసభను విస్మరించడం ఎవరికైనా కష్టమవుతుంది. పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ పెసా రాజ్యాంగ వాగ్దానానికి రక్షకుడిగా నిలిచింది. ఈ ర్యాంకింగ్లు, సూచికలు విధానపరమైన ఆశల నుంచి పనితీరు నిర్వహణ వైపుకు మార్పును సూచిస్తాయి. గ్రామసభలకు ఖనిజాల ద్వారా రావాల్సిన రాయల్టీ వాటా ఇంకా అందడం లేదు. జార్ఖండ్, ఒడిశా తమ నిబంధనలను ఖరారు చేస్తున్న తరుణంలో, పెసా అమలును బలోపేతం చేయడానికి కొత్త వేగం వచ్చింది. పెసా ర్యాంకింగ్లు రాష్ట్రాల పనితీరును మరింత ప్రోత్సహిస్తాయని భావిస్తున్నారు.
మిలింద్ థట్టె
milind@teerfoundation.in
స్వతంత్ర థింక్ ట్యాంక్ డైరెక్టర్
