చెన్నై: ఏపీలో ఎండలు మండిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పొరుగునే ఉన్న తమిళనాడుకు మాత్రం వరుణుడు కరుణించాడు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయక్కడ.
చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురుస్తోన్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావమే ఈ అకాల వర్షాలకు దారి తీసింది. నేడు, రేపు తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అదే సమయంలో ఎండ తీవ్రత కూడా తగ్గింది. పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గుముఖం పట్టింది.భారీ వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తమిళనాడులో దక్షిణ ప్రాంతంలో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్ కాశి, తూత్తుకూడి, విరుధునగర్, రామనాథపురం, పుదుక్కోట్టై, శివగంగ, తంజావూరు, మధురై జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. శనివారం ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.ఇప్పుడు తాజాగా మరో ఎనిమిది జిల్లాలను ఈ జాబితాలోకి చేర్చింది రీజినల్ ఐఎండీ.
చెన్నై, తిరుచ్చి, ఈరోడ్, సేలం, తిరువారూర్, నాగపట్నం, మైలాడుథురై, థేని, దిండిగల్, కోయంబత్తూరు.. వంటి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పుదుచ్చేరి, కారైకల్ సహా మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వీటి తీవ్రత ఆదివారం వరకూ ఉంటుంది.గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత స్వల్పంగా తగ్గినట్టే కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుదల నమోదైంది. తమిళనాడు దక్షిణ ప్రాంత జిల్లాలు, పుదుచ్చేరి, కారైకల్‌లల్లో 28 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత రికార్డయింది. వర్ష ప్రభావం లేని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది.