- పాణ్యం శాసనసభ్యురాలు చరిత రెడ్డి
- కల్లూరు 16 వార్డుల అభివృద్ధిపై సమీక్ష.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని పాణ్యం నియోజకవర్గ కల్లూరు 16 వార్డుల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పాణ్యం శాసనసభ్యురాలు చరితరెడ్డి ఆదేశించారు. శనివారం ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్ యస్.
రవీంద్ర బాబుతో కలిసి నగరపాలక అధికారులు, సచివాలయ సిబ్బందితో కల్లూరు వార్డుల అభివృద్ధిపై సమీక్షించారు. ముందుగా వార్డుల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం వార్డుల్లో పేర్కొన్న స్థానిక సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్లూరు అర్బన్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వాటికి మంచి ఫలితాలు వచ్చేలా అందుకనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు.
తాగునీటిని సమస్య పరిష్కారానికి, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.187 కోట్లు నిధులను మంజూరు చేసిందని, జగన్నాథ గట్టుపై 50 ఎంఎల్‌డి నీటి శుద్ధి కేంద్రానికి రూ.115 కోట్లు, పుచ్చలపల్లి సుందరయ్య పార్కులో 12 ఎంఎల్‌డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి రూ.22 కోట్లు, కల్లూరు అర్బన్ వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.50 కోట్లను ముఖ్యమంత్రి కేటాయించారని, ఈ నిధులన్నీ సమర్థవంతంగా వినియోగించుకొని పనులు చకచకా జరిగేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ఒక్కొక్క వార్డులో ప్రాధాన్యత క్రమంలో రూ.50 లక్షలతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం లభించేంత వరకు ఎద్దడి తలెత్తకుండా అప్పటిలోపు తాత్కాలిక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, వార్డుల్లో పేర్కొన్న సమస్యలను సైతం త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నగరపాలక సాధారణ నిధులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రణాళికలను ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నామని, రహదారులు, మురుగు కాలువలు, వీధి దీపాల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. చిన్నపాటి సమస్యలను తమ అధికారుల దృష్టికి వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నామని, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సైతం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సమావేశం అనంతరం.. 20వ వార్డు బద్రినాథ్ నగర్ నందు రూ. 50 లక్షలతో సిసి డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే, కమిషనర్ శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఇంచార్జ్ ఎస్ఈ శేషసాయి, ఆర్‌ఓలు జునైద్, ఇశ్రాయేల్, ఎంఈ శేషసాయి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.