Andhra Pradesh agriculture | నకిలీ విత్తనాల అరికట్టుకు ప్రభుత్వ చర్యలు

Andhra Pradesh agriculture | నకిలీ విత్తనాల అరికట్టుకు ప్రభుత్వ చర్యలు

Andhra Pradesh agriculture | ఖరీఫ్ సీజన్‌కు విత్తనాల పంపిణీ సిద్ధం
వేరుశెనగ విత్తనాలపై 40 శాతం రాయితీ
విత్తనోత్పత్తిలో ఏపీకి పెరుగుతున్న గుర్తింపు
ఇతర రాష్ట్రాలకు భారీగా విత్తనాల ఎగుమతి

Andhra Pradesh agriculture | అమరావతి, ఆంధ్రప్రభ : నకిలీ, నాసిరకం విత్తనాలను అరికట్టటంతో పాటు ప్రైవేట్ మార్కెట్లో అధిక ధరలను అదుపుచేసేందుకు విత్తనోత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2025-26 సంవత్సరం నుంచి గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో మార్పులు చేసి కొత్త విత్తన రకాల పెంపొందించడానికి తోడ్పాటునందించేందుకు సమగ్ర పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1,03,901 క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేసినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రకటించింది. 2026-27 సంవత్సరానికి 1,20,678 క్వింటాళ్ల విత్తనోత్పత్తిని లక్ష్యంగా ప్రకటించినట్టు వెల్లడించింది.

ఖరీఫ్ సీజన్లో వరి కంటే ముందుగా రాయలసీమ జిల్లాల్లో సాగయ్యే వేరుశెనగ పంట కోసం ఈనెల 20 నుంచి విత్తనాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 30వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు. మిగిలిన అవసరాల కోసం టీజీఎస్ డీసీ, హెచ్ఐఎల్, ఎన్ఎస్ సీ, ఆంగ్రూ సంస్థల ద్వారా అదనపు విత్తనాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది 2.20 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40శాతం రాయితీపై పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేరుశనగ విత్తనాల సేకరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. రైతు సేవా కేంద్రాల ద్వారా ఈనెల 20వ తేదీ నుంచి విత్తనాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేరుశెనగ విత్తనాలు కాకుండా 1.62 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాల పంపిణీకి కూడా రంగం సిద్ధమైంది.

ఖరీఫుకు కావాల్సిన విత్తనాలు సిద్ధం

ఈ పంపిణీలో సమగ్ర విత్తనోత్పత్తి పథకం కింద రైతులు పండించిన విత్తనాలు కూడా భాగస్వామ్యం కానున్నాయి. 2006 ఖరీఫ్ సీజన్ నాటికి విత్తనాభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించటం ద్వారా వివిధ పంటలు పండించే రైతాంగం అవసరాలు తీర్చాలని ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో 1,03,901 క్వింటాళ్ల విత్తనాల ఉత్పత్తి రావటం ఈ పథకం లక్ష్యాలను ప్రతిబింబిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విత్తనాభివృద్ధి ప్రాసెసింగ్ ప్రక్రియ వివిధ దశల్లో ముమ్మరంగా కొనసాగుతోంది.

కంపెనీలతో కుదిరిన ఎంవోయూలు

ఇప్పటికే రాష్ట్రం నుంచి సుమారు రూ.1000 కోట్లు విలువ చేసే విత్తనాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. అందులో కర్నూలు జిల్లా వాటా 50శాతంగా ఉన్నట్టు అంచనా. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విత్తనాల ఉత్పత్తి కొనసాగుతుండగా కొందరు రైతులు, దేశీయ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు కూడా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో విత్తనాభివృద్ధి ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టారు.

ఖరీఫ్ లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరితో పాటు బీటీ పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, జొన్న, జనపనార, మినుము, పెసర, సజ్జ తదితర విత్తనాల ప్రాసెసింగ్ ముమ్మరమైంది. కర్నూలు జిల్లాలోనే సుమారు 10వేల మంది రైతులు 30వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విత్తన సాగు చేపట్టారు. అంకూర్, తులసి, మహికో, బేయర్, పయనీర్, సింజెంటా, నూజివీడు, గంగా-కావేరి తదితర కంపెనీలు బహుళ జాతి కంపెనీలతో ఎంఓయులు కుదుర్చుకుని విత్తనాభివృద్ధి చేపడుతున్నాయి.

కర్నూలు, నంద్యాల, ఆదోనితో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో అత్యధికంగా సీడ్ ఉత్పత్తి అవుతోంది. నంద్యాల తదితర ప్రాంతాలు వరి, మొక్కజొన్న విత్తనాభివృద్ధిలో దేశవ్యాప్తంగా పేరు సంపాదించాయి. కొన్ని విత్తన కంపెనీలు విత్తన పరిశోధనా కేంద్రాలతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కుదుర్చుకుని విత్తనాభివృద్ధి చేపడుతున్నాయి. ఎంఓయుల ద్వారా యూనివర్సిటీలు అభివృద్ధి చేసిన వంగడాల బ్రీడర్ సీడను తీసుకుని రైతులకు అందించి ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేయిస్తున్నాయి. ఫలితంగా నాణ్యతా ప్రమాణాలతో కూడిన, బలవర్ధకమైన సీడ్ ఉత్పత్తి కావటమే కాకుండా మార్కెట్లో మంచి ధర లభిస్తోందనీ, విత్తనోత్పత్తి చేయించిన కంపెనీలే తమ వద్ద సీడ్ కొనుగోలు చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఎక్కువగా నెలకొల్పితే విత్తనాభివృద్ధిలో ఏపీ మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాలకు విత్తనాల ఎగుమతి

ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, అసోంలకు హైబ్రిడ్ మొక్కజొన్న, సజ్జ విత్తనాలు ఎగుమతి అవుతుండగా.. అసోం, పశ్చిమ బెంగాలు జనపనార విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. గుజరాత్, హర్యానా రాష్ట్రాలు ఏపీ నుంచి పత్తి, మొక్కజొన్న, వరి విత్తనాలను దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి కర్నూలు, బాపట్ల, మార్టేరు వరి విత్తనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేసి విత్తనాభివృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యమవుతోంది.

Leave a Reply