కలెక్టర్, ఎస్పి ల నేతృత్వంలో 4 వేల కిలోల గంజాయి ధ్వంసం

కలెక్టర్, ఎస్పి ల నేతృత్వంలో 4 వేల కిలోల గంజాయి ధ్వంసం
- జిల్లాలో పకడ్బందీ గా గంజాయి నిర్మూలన
- అటు అవగాహన ఇటు పి డి కేసుల నమోదు
తిరుపతి (రాయలసీమ బ్యూరో ) ఆంధ్రప్రభ : తిరుపతిజిల్లా పరిధిలో నిర్వహించిన పలు దాడుల్లో పట్టుబడిన సుమారు రూ.20 కోట్ల విలువ గల 4,100 కేజీల గంజాయిని కోర్టు అనుమతి తో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎల్ సుబ్బారాయుడు శుక్రవారం నాడిక్కడ ధ్వంసం చేయించారు. రేణిగుంట మండలం తుక్కివాకం వద్ద ఉన్న సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్‌లో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని చట్టపరమైన విధానాల ద్వారా డిస్పోజ్ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గంజాయి నిర్మూలన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోందన్నారు. తిరుపతి జిల్లాలో గడిచిన రెండు నుంచి మూడు సంవత్సరాల్లో సుమారు 208 కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.20 కోట్ల విలువ గల 4,100 కేజీల గంజాయిని ఇన్సినరేషన్ (Incineration) పద్ధతిలో ద్వారా డిస్పోజ్ చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో సుమారు 15 పీడీ కేసులు (ప్రివెంటివ్ డిటెన్షన్) పెట్టడం జరిగిందన్నారు. తిరుపతి పట్టణం బెంగళూరు, చెన్నైకి ఒక ట్రాన్సిట్ పాయింట్‌గా గంజాయి రవాణాలో గుర్తించడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లాకు ఎక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వైజాగ్, కాకినాడ మీదుగా బస్సుల్లో, ఇతర ప్రైవేట్ వాహనాల్లో తిరుపతికి వచ్చి, ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు మరియు కేరళకు వెళ్లడం గమనించామన్నారు. వాటిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సెర్చ్ పార్టీలను పెట్టి ట్రైన్స్, బస్సులు, లగేజీలను పరిశీలించి చేసి సీజ్ చేయడం జరిగిందన్నారు. పట్టుబడిన గంజాయిని సీజ్ చేయడంతో పాటు లక్ష మంది స్కూల్ మరియు కాలేజ్ 8, 9, 10 మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులను ఒకే వేదికపైకి తెచ్చి, ఆన్లైన్ ద్వారా గంజాయి వల్ల కలిగే దుష్ప్రభావాల మీద అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం అరికట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాల ద్వారా గంజాయి, మత్తు పదార్థాల వాడకం దుష్ప్రభావం, ఆరోగ్య సమస్యల ను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. వివిధ విద్యా సంస్థలు, ఎన్జీవోలు, పోలీస్ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం, ఎటువంటి గంజాయికి స్థానం లేదని అంటూ . రానున్న రోజుల్లో ప్రజల్లో మరింత పూర్తిగా అవగాహన కల్పించి, లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ గజాయిని పూర్తిగా రూపుమాపడానికి చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి లు, డిఎస్పి లు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

