AP | ఆ ఐదుగురు అరెస్ట్..

AP | ఆ ఐదుగురు అరెస్ట్..
- మాదినేని మహేష్ హత్య కేసు ఛేదన
- ఆర్థిక లావాదేవీలే కారణం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మాదినేని మహేష్ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పుట్టపర్తి డీఎస్పీ బి. విజయ్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం పుట్టపర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, పుట్టపర్తి అర్బన్ సీఐ ఓ.శివాంజనేయులుతో కలిసి కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు. కొత్తచెరువు మండలం తిప్పాపట్లపల్లి గ్రామానికి చెందిన మాదినేని మహేష్ (31) హత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమని డీఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో పుట్టపర్తి టౌన్ పోలీసులు వేగంగా దర్యాప్తు నిర్వహించి నిందితులను పట్టుకున్నారన్నారు.

AP | అరెస్టు వివరాలు:
8వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొత్తచెరువు–పెనుకొండ రోడ్డులో తలమర్ల క్రాస్, శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఒక ఇన్నోవా కారు (AP 02 CC 9009), రెండు మోటార్ సైకిళ్లు (పల్సర్ KA 64 H 4149, స్ప్లెండర్ AP 02 AP 0105), ఐదు మొబైల్ ఫోన్లు, ఒక ఐరన్ పైప్, మృతుడి ఎలక్ట్రిక్ స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
AP | ముద్దాయిల వివరాలు:
A-1 యలపల మారుతీ ప్రసాద్ రెడ్డి @ తలమర్ల మారుతీ రెడ్డి (42), రియల్ ఎస్టేట్ వ్యాపారి
A-2 సాలక్కగారి వంశీ కిషోర్ @ కిషోర్ (41), మీ-సేవ కేంద్ర నిర్వాహకుడు
A-3 కోటంపల్లి లోకేష్ @ బ్యాంక్ లోకేష్ (31), రైతు
A-4 జి. బాలమిత్ర @ బాలు (31)
A-5 పుట్లూరు అభిషేక్ @ మెకానిక్ అభి (37)
AP | కేసు నేపథ్యం:
మృతుడు మహేష్, ముద్దాయిలైన మారుతీ రెడ్డి, లోకేష్ గతంలో కలిసి ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారని తెలిపారు. ఇటీవల వారి మధ్య విభేదాలు ఏర్పడి, ఈ నేపథ్యంలో మహేష్, లోకేష్ మధ్య గొడవ జరగడంతో కొత్తచెరువు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే విషయంపై 01-01-2026 అర్ధరాత్రి గెస్ట్ హౌస్ వద్ద మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మహేష్‌ను వెంబడించిన ముద్దాయిలు హంద్రీనీవా కాలువ సమీపంలో రాయి, ఐరన్ పైప్‌తో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం శవాన్ని, ఎలక్ట్రిక్ బైక్‌ను కాలువలో పడవేసి ఆధారాలు నాశనం చేయాలని ప్రయత్నించినట్లు తెలిపారు.
AP | క్రిమినల్ నేపథ్యం:
A-1 మారుతీ రెడ్డిపై 7 కేసులు ఉండగా, రౌడీషీట్ ఉంది. A-2 వంశీ కిషోర్‌పై కూడా 7 కేసులు ఉన్నాయి. A-3 లోకేష్‌పై 2 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పుట్టపర్తి అర్బన్ సీఐ ఓ. శివాంజనేయులు, ఎస్సైలు, సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
