AP | బొమ్మలూరు వద్ద ఘోర ప్రమాదం..

AP | బాపులపాడు – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని ఒక కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రముఖ తిరుమల విద్యాసంస్థల నిర్వాహకుడు సురేశ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సురేశ్‌ తన భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా బొమ్మలూరు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారును సురేశ్‌ స్వయంగా నడుపుతున్నారు. రహదారి పక్కన ఆగి ఉన్న లారీని గమనించకపోవడంతో కారు అతివేగంగా వెళ్లి లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. కారు ముందుభాగం పూర్తిగా నలిగిపోవడంతో, డ్రైవింగ్ సీట్లో ఉన్న సురేశ్‌కు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతిచెందారు.

పక్క సీట్లో కూర్చున్న ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సురేశ్‌ అకాల మరణంతో తిరుమల విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.