విఠల నామస్మరణతో బైరాపూర్‌కు పాదయాత్ర
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: జుక్కల్ మండలం లొంగన్ గ్రామం భక్తి కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఆషాఢమాసం ముగింపు సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే సంప్రదాయంలో భాగంగా ఈసారి కూడా గ్రామానికి చెందిన భక్తులు బైరాపూర్లోని ప్రసిద్ధ విఠలేశ్వర ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. మంగళవారం శంకర్ మహరాజ్, బాలాజీ మహరాజ్, హన్మంత్ మహరాజ్, బల్రాం మహరాజ్‌ల ఆధ్వర్యంలో భక్తులు, గ్రామస్తులు పాదయాత్ర ప్రారంభించారు.
భాజా భజంత్రీలు, భజన కీర్తనలతో ప్రారంభమైన పాదయాత్రలో విఠల.. విఠల నామస్మరణలతో లొంగన్ గ్రామం మారుమోగింది. సుమారు 55 కిలోమీటర్ల మేర రెండు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. గ్రామ సర్పంచ్ భర్త సదాశివ్ పటేల్, గ్రామ పెద్దలు గ్రామ పొలిమేరల వరకు వచ్చి భక్తులకు వీడ్కోలు పలికారు. చిన్న ఎడ్గి, లాడేగాం, ఫత్లాపూర్, బిచ్కుంద, హజ్గుల్ గ్రామాల మీదుగా యాత్ర సాగనుంది. హజ్గుల్ గ్రామంలో భక్తులు రాత్రి బస చేయనున్నారు. బుధవారం బైరాపూర్ చేరుకుని విఠలేశ్వరుడికి జలాభిషేకం, పుష్పాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రలో నామ్‌దేవ్, శంకర్గొండ, నగల్గిద్దె రామ్‌నాథ్, రాజు, కౌరే శంకర్, వడ్ల మారుతి, మాజీ ఎంపీటీసీ విఠల్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
