బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : మద్యం మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన పేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని లంబాడాకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు భరత్ చవాన్ డిమాండ్ చేశారు.
శుక్రవారం ఉట్నూర్‌లోని శాంతినగర్, వడ్డెర కాలనీలను ఆయన సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మద్యం కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా భరత్ చవాన్ మాట్లాడుతూ మద్యం మహమ్మారి వల్ల అనేక పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉండే పెద్దలను కోల్పోవడంతో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న మద్యం దుకాణాలను వెంటనే గ్రామాల వెలుపలికి తరలించాలని, మద్యం విక్రయాల సమయాన్ని గణనీయంగా తగ్గించేలా ఎక్సైజ్ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాలనీల ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తానని భరత్ చవాన్ స్పష్టం చేశారు.
