ADB | అనాథ పిల్లలకు అండగా..

ఉట్నూర్/జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మోడీగూడ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన గిరిజన పిల్లలకు రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ వెంకట్ ముండే మంగళవారం అండ‌గా నిలిచారు. ఆ పిల్లలకు రూ.50 వేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకున్నారు.

ఈ సందర్భంగా వెంకట్ ముండే మాట్లాడుతూ, మార్గదుర్భర పరిస్థితుల వల్ల అంబులెన్స్ అందక, తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరక ముందే ప్రాణాలు కోల్పోయిన విషయం పత్రిక వార్తల ద్వారా తెలిసి, వెంటనే గ్రామానికి వచ్చి పరిస్థితిని స్వయంగా పరిశీలించినట్టు తెలిపారు. పిల్లలు అనారోగ్య సమస్యలు, చర్మవ్యాధులతో బాధపడుతున్నందున వెంటనే ప్రభుత్వ శాఖలు స్పందించాలని, గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ నిధులను వినియోగించి, ఈ పిల్లలను సురక్షిత ఆశ్రమానికి తరలించే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రోడ్లు కూడా లేని అంతర్గ్రామ ప్రాంతానికి స్వయంగా వచ్చి సహాయం అందించినందుకు గ్రామస్తులు వెంకట్ ముండేను అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పటేళ్లు, రామచందర్ నాయకులు సతీష్ ముందే, సమాధాన్ డోంగ్రే, అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ ఆసిఫాబాద్ జిల్లా నాయకులు కామిడీ అశోక్, సామాజిక కార్యకర్త గేడం దత్త, కోలాం సంగం జిల్లా నాయకులు ఆత్రం శంకర్ కొలం, గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply