Accident | లారీని ఢీ కొన్న బస్సు – స్పాట్ లోనే నలుగురు దుర్మరణం

వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్‌ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పరిగి దవాఖానకు తరలించారు. ప్రథమచికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్‌ జిల్లా దవాఖానకు తరలించారు. పలువురిని హైదరాబాద్‌ ఉస్మానియా హాస్పిటల్‌కు రెఫర్‌ చేశారు.

బాధితులంతా సోమవారం రాత్రి పరిగిలో జరిగిన వివాహ రిసెప్షన్‌ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో రంగాపూర్‌ వద్ద ఆగిఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతులను హేమలత, బాలమణి, మల్లేశ్‌, సందీప్‌గా గుర్తించామన్నారు.

వీరంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చందనవల్లి గ్రామానికి చెందిన వారని వెల్లడించారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply