Avanigadda | నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే..
Avanigadda | నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే..
Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : 2026వ సంవత్సరంలో ప్రజలందరూ బాధ్యతాయుతంగా, క్షేమంగా, సురక్షితంగా, సుఖసంతోషాలతో బంధుమిత్రులతో ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి శ్రీ విద్య తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో నూతన విజయాలు, సంతోషాలు నింపాలని అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీస్ తరుపున శుభాకాంక్షలు తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపటం, అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం, ద్విచక్ర వాహనం పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేయటం, రేసింగ్ చేయటం నిషేధమన్నారు. బార్లు, వైన్ షాపులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన సమయాలలో మాత్రమే అమ్మకాలు జరపాలి అన్నారు. బహిరంగ ప్రదేశాలలో, రోడ్ల పక్కన, బీచ్‌లలో గుమిగూడకూడదు.. అర్ధరాత్రి వేడుకలు జరపకూడదు, కేకులు కటింగులు చేయకూడదు.. పైన పేర్కొన్న వాటిలో ఏవైనా ప్రైవేట్ ప్రదేశాలలో మాత్రమే చేయాలన్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి సమయంలో వాహనాల నుండి సైలెన్సర్లను తొలగించి రోడ్లపై వాటిని నడపడాన్ని నిషేధించామని చెప్పారు. డీ.జే. లకు అనుమతి లేదు.
మైక్ బాక్స్‌లకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. బహిరంగంగా పార్టీలు నిర్వహించడం, అశ్లీల నృత్యాలు చేయడం, అనుచితమైన లేదా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్పిటల్స్, వృద్ధాశ్రమాలు వంటి సున్నితమైన ప్రాంతాల్లో అధిక శబ్దంతో ప్రజా శాంతికి భంగం కలిగించకుండా ఉండాలని, అంతేకాకుండా వేడుకల పేరుతో మందు గుండు సామాగ్రిని కాల్చడం ప్రదర్శించడం చేస్తే చర్యలు తప్పవన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారి పై, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రుల పైన, వాహనా యజమానుల పైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
నూతన సంవత్సరం సంబరాల సందర్భంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టబడతాయని, అధిక మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన వ్యక్తుల పై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని తెలియజేశారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుండి జిల్లా మొత్తంలో పోలీసు పికెట్స్, గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు. అన్ని ముఖ్య కూడళ్ళలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, రోడ్డు ప్రమాదాలు లేదా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం తప్పదని, ప్రజలందరూ స్థానిక పోలీసులకు సహకరించి, బాధ్యతాయుతంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అవనిగడ్డ పోలీసు తరుపున తెలియజేశారు.
