Grievance | అధికారుల నిర్లక్ష్యంతో..

Grievance | అధికారుల నిర్లక్ష్యంతో..

Grievance | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలంలో ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ఒక్క అధికారి కూడా హాజరుకాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో పూర్తిగా నీరుగారిపోయింది.

గ్రీవెన్స్‌(Grievance)కు అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కార మార్గాలు చూపించాల్సి ఉన్నప్పటికీ, తనకల్లు మండలంలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా కనిపించింది. దూర ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం(problem resolution) కోసం ఆశతో వచ్చినా, అధికారులు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూసిన ప్రజలు చివరకు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇలా అధికారులు గైర్హాజరవుతుంటే.. ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మండల స్థాయిలో ఇంతటి దారుణ పరిస్థితి నెలకొనడానికి పై అధికారుల(officials) పర్యవేక్షణ లోపమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల పట్ల కనీస బాధ్యత కూడా లేకుండా వ్యవహరించడం శోచనీయమని పలువురు వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తూ… గ్రీవెన్స్‌కు గైర్హాజరైన మండల అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థ(democratic system)కు ప్రమాదకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా స్థాయి అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు చేపట్టాలని వారు కోరారు.

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వీర్యం కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.

Leave a Reply