Tangirala Sowmya | పేదలకు కార్పొరేట్ వైద్యం..

Tangirala Sowmya | పేదలకు కార్పొరేట్ వైద్యం..
- ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
- ఏరియా హాస్పిటల్‌లో రూ.35 లక్షల అల్ట్రా సౌండ్ ల్యాబ్ ప్రారంభం
Tangirala Sowmya | నందిగామ రూరల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. పట్టణంలోని డీవీఆర్ ఏరియా హాస్పిటల్‌లో శనివారం రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన అల్ట్రా సౌండ్ ల్యాబ్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, కూటమి నేతలు, వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రభుత్వ ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్ ల్యాబ్‌లను మంజూరు చేయగా అందులో నందిగామ డీవీఆర్ ఏరియా హాస్పిటల్ ఒకటిగా ఎంపిక కావడం ఆనందకరమని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అల్ట్రా సౌండ్ ల్యాబ్ ద్వారా గర్భిణులు, మహిళలు, పేద ప్రజలకు స్థానికంగానే కీలక వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ సభ్యులు, వైద్యులు, అధికారులు, కూటమి నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

