Deepti Sharma | హిస్టరీలో కొత్త రికార్డ్..

Deepti Sharma | హిస్టరీలో కొత్త రికార్డ్..
ఆంధ్రప్రభ : భారత మహిళా క్రికెటర్ స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే, టీ20 రెండు ఫార్మాట్‌లలోనూ 150 వికెట్ల మైలురాయిని అందుకున్న ప్రపంచపు మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డును నెలకొల్పింది దీప్తి.
ప్రస్తుతం ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న దీప్తి, తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఈ అద్భుత ఘనతను సాధించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టిన ఆమె, ప్రత్యర్థి బ్యాటర్లను వణికించింది.
ప్రపంచ రికార్డ్ సమం..
మ్యాచ్ చివరి ఓవర్‌లో శ్రీలంక క్రీడాకారిణి మల్షా షెహానిని అవుట్ చేస్తూ.. తన 151వ టీ20 వికెట్‌ను ఖాతాలో వేసుకుంది. దాంతో, ఆస్ట్రేలియా పేసర్ మేగాన్ షుట్ (151 వికెట్లు) రికార్డును సమం చేసింది దీప్తి శర్మ. ఇక ఈ సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో, టీ20ల్లో ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు ఆమెకు మంచి అవకాశం ఉంది.
పురుషులతో పోటీ..
కేవలం మహిళా క్రికెట్‌లోనే కాకుండా, భారత్ తరఫున టీ20 ఫార్మాట్‌లో (పురుషులు, మహిళలు కలిపి) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా దీప్తి శర్మ రికార్డు సృష్టించింది. ఆమె 151 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, అర్ష్‌దీప్ సింగ్ (110), జస్‌ప్రీత్ బుమ్రా (103), రాధా యాదవ్ (103), హార్దిక్ పాండ్యా (101) ఆమె తర్వాత స్థానాల్లో ఉన్నారు.
దీప్తి శర్మ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతోంది. ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ తొలిసారి ఐసీసీ టైటిల్‌ను గెలవడంలో ఆమె కీలక పాత్ర పోషించి, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా కైవసం చేసుకుంది.
వన్డే 2025 లో తిరుగులేని ఆధిపత్యం..
మరోవైపు, 2025 ఏడాదిలో వన్డే ఫార్మాట్‌లో కూడా దీప్తి శర్మ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సంవత్సరంలో 27.10 సగటుతో 39 వికెట్లు తీసి వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రథమ స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన నాన్కులులెకో (35 వికెట్లు), ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్కల్‌స్టోన్ (28 వికెట్లు) ఆమె తర్వాత స్థానాల్లో ఉన్నారు.
టాప్ 3 తో దీప్తీ..
ఇక అన్ని ఫార్మాట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో దీప్తి శర్మ ఇప్పుడు మూడో స్థానానికి (333 వికెట్లు) చేరుకుంది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ (331 వికెట్లు) రికార్డును అధిగమించింది. భారత దిగ్గజం జులన్ గోస్వామి (355 వికెట్లు) తర్వాత టీమిండియాలో అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా ఎదిగిన దీప్తి, బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణిస్తూ మేటి ఆల్‌రౌండర్‌గా తన ముద్ర వేస్తోంది.
