Awareness | పల్స్ పోలియోపై అవగాహన

Awareness | పల్స్ పోలియోపై అవగాహన
- చిత్తూరులో వైద్యశాఖ ర్యాలీ
- రెండు చుక్కలే నిండు జీవితానికి మార్గం
Awareness | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డిటి సుధారాణి నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీని చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కుమారి అముద జెండా ఊపి ప్రారంభించారు.
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో నిండు జీవితానికి రెండే చుక్కలు, రేపే పల్స్ పోలియో, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో వేయించండి, అంగవైకల్యం నుంచి కాపాడుకోండి అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ర్యాలీ ముగింపులో పాల్గొన్న వారందరితో పల్స్ పోలియోపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో పోలియో కేసులు జీరోగా ఉన్నప్పటికీ, చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాల్లో పోలియో కేసులు కనిపిస్తున్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ప్రతి ఏడాది డిసెంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ తరాలను అంగవైకల్యం నుంచి కాపాడవచ్చని వివరించారు.
జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 69 పీహెచ్‌సీలు, యూపీహెచ్సీల పరిధిలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు గల 2,21,502 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 142 రూట్లలో 212 వాహనాలు, 1,415 పోలియో బూతులు, 5,800 మంది సిబ్బందిని నియమించి మొత్తం 2,94,600 పోలియో వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని సీడీపీవోలు, ఎంఈవోలు, వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు. పోలియో బూత్‌లలో ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు సేవలందిస్తారని వివరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు బూత్‌లలో, రెండో మరియు మూడో రోజుల్లో ఇంటింటికి వెళ్లి ఎక్స్, పీ మార్కింగ్ చేస్తూ మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వహించి, పోలియో లేని సమాజాన్ని నిర్మిద్దామని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చుడ చైర్మన్ శ్రీమతి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, వైద్యులు వెంకట ప్రసాద్, హనుమంతరావు, లోకేష్, ప్రవీణ్, గిరి, అనూష, ప్రోగ్రాం అధికారులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
