పూర్వ విద్యార్థుల ప్రోత్సాహం..

  • తూర్పు తాళ్ల జెడ్పీ పాఠశాలకు వరం
  • మెరిట్ విద్యార్థులకు నగదు పారితోషికం

నర్సాపురం, ఆంధ్రప్రభ : తూర్పు తాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ‘మన సేవా సంస్థ’ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాము పుట్టిన ఊరికి, చదువుకున్న పాఠశాలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నారు. 1998-99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన 40 మంది పూర్వ విద్యార్థులు ‘మన సేవా సంస్థ’ను ఏర్పాటు చేసుకుని ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండున్నర దశాబ్దాలుగా వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని గ్రామస్థులు, ఉపాధ్యాయులు తెలిపారు.

ఈ సందర్భంగా 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదు పారితోషికాలు అందించారు. ప్రథమ స్థానానికి రూ.5 వేలు, ద్వితీయ స్థానానికి రూ.3 వేలు, తృతీయ స్థానానికి రూ.2 వేల చొప్పున నగదుతో పాటు జ్ఞాపికలు అందజేశారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కూడా ప్రోత్సాహక బహుమతులు అందించారు.

ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తే పేద విద్యార్థుల ఉన్నత విద్యకు మరింతగా దోహదపడుతుందని పూర్వ విద్యార్థులు అన్నారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలను దత్తత తీసుకుంటే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్య అందించవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరింత శిక్షణ అందించే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు.