1xBet Promotion | తిరిగి ఇచ్చేశారు..

  • బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై ఉక్కుపాదం..
  • ఏడుగురు స్టార్లకు ఈడీ షాక్
  • తాజాగా రూ.7.93 కోట్లు ఆస్తులు అటాచ్
  • ఇప్పటివరకు రూ.19.7 కోట్లు స్వాధీనం

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల్లో నటించి, వాటిని ప్రోత్సహించిన సినీ, క్రీడా ప్రముఖులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కఠిన చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ మనీ లాండరింగ్ కేసులో భాగంగా, దర్యాప్తు సంస్థ తాజాగా సుమారు రూ.7.93 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు సోనూసూద్, నటి నేహా శర్మలతో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప వంటి దిగ్గజాలు ఉండటం గమనార్హం.

సిక్సర్ల హీరో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నుంచి రూ.2.5 కోట్లు. సినీ నటి ఊర్వశి రౌతేలా తల్లి మీరా రౌతేలా నుంచి రూ.2.02 కోట్లు, నటి నేహా శర్మ నుంచి రూ.1.26 కోట్లు, మానవతావాది కరోనా హీరో సోనూసూద్ నుంచి రూ.1 కోటి, నటి, మాజీ టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి నుంచి రూ.59 లక్షలు, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా నుంచి రూ.47 లక్షలు, మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప నుంచి రూ.8.26 లక్షలు చొప్పున ఈడీ జప్తు చేసింది.

మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు సామాన్య ప్రజలను ఆకర్షించడానికి సెలబ్రిటీలకు భారీ మొత్తంలో పారితోషికాలు చెల్లించారు. అయితే, ఆ నిధులు అక్రమ మార్గాల్లో మళ్లించినవేనని ప్రాథమిక విచారణలో తేలడంతో ఈడీ రంగంలోకి దిగింది.

ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం రూ.19.7 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖులను ప్రశ్నించిన అధికారులు, అక్రమంగా సంపాదించిన ప్రతి పైసాను వెలికితీసేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం వినోద, క్రీడా రంగాల్లో కలకలం రేపుతుండగా, ప్రమోషన్ల విషయంలో సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.