ప్రశాంతంగా ముగిసిన మెదక్ గ్రామపంచాయితీ ఎన్నికలు

- జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
మెదక్, ఆంధ్రప్రభ: మెదక్ జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామపంచాయితీ ఎన్నికలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఈ నెల 11 నుంచి 17 వరకు జరిగిన ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజలు, పోలీసు అధికారులు, ఇతర శాఖల సిబ్బందికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు మొత్తం 750 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఎన్నికల తేదీల నుండి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేసినట్లు, ప్రజలు ఎలాంటి ప్రలోభాలు, భయభ్రాంతులకు గురికాకుండా నిరంతర నిఘా కొనసాగించామని వివరించారు.
జిల్లాలో విస్తృత తనిఖీల ద్వారా ఇప్పటి వరకు రూ.47,48,000 నగదు, 268 కేసుల్లో సుమారు రూ.26,46,968 విలువ గల 3,688 లీటర్లు మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా, రూ.27,36,000 విలువ గల 673 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం విలువగా రూ.1 కోటి 1 లక్ష 32 వేల రూపాయలు లబ్ధమైందని ఎస్పీ తెలిపారు.
గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి ముందస్తుగా 1,122 మందిని బైండోవర్ చేయడం జరిగిందని కూడా చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు సిబ్బంది చలి, పగలు, రాత్రి లెక్కించకుండా కష్టపడి విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. ఎస్పీ శ్రీనివాస రావు, ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరగడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.
