ANRliveon | అక్కినేని కాలేజీలో.. నాగార్జున..

ANRliveon | అక్కినేని కాలేజీలో.. నాగార్జున..
ANRliveon, గన్నవరం, ఆంధ్రప్రభ : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున బుధవారం ఉదయం 9:10 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అనంతరం నాగార్జున రోడ్డు మార్గంలో గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలలో నిర్వహించనున్న డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సోదరి నాగ సుశీల కూడా ఉన్నారు.
అక్కినేని బడికి వెళ్లి చదువుకోకపోయినా.. జీవితాన్ని బాగా చదువుకున్నారు. ఆయనకు చదువు విలువ బాగా తెలుసు. అందుకనే.. గుడివాడలో కళాశాల ఏర్పాటు చేశారు. ఈ కళాశాల ఎంతో మందిని విద్యావంతులుగా మార్చింది. ఇప్పుడు ఆ కళాశాల డైమండ్ జూబ్లీ జరుపుకునే స్థాయికి వచ్చింది. అక్కినేని చదువుకోకపోయినా.. ఇంగ్లీషు నేర్చుకోవాలి.. ఇంగ్లీషులో మాట్లాడాలి అని పట్టుదలతో డైలీ ఇంగ్లీషు పేపర్ చదువుతూ.. ఇంగ్లీషు నేర్చుకున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
నటన విషయానికి వస్తే.. నటనకు నిలువెత్తు నిదర్శనం. ఆయన ఏ పాత్ర పోషించినా.. ఆ పాత్రలో అంతకన్నా గొప్పగా ఇంకెవరూ చేయలేరు అనిపించేలా నటిస్తుంటారు. అలాగే ఆయన చివరి శ్వాస వరకు నటించారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు కలిసి మనం సినిమా చేస్తున్నప్పుడు.. అక్కినేనికి క్యాన్సర్ వచ్చింది. ఈ సినిమాకి డబ్బింగ్ ఆయన బెడ్ పై ఉండి చెప్పారు. అలాగే ఆ సినిమా తన వలన ఆగిపోకూడదనే ఉద్దేశ్యంతో.. తన పై చిత్రీకరించాల్సిన క్లైమాక్స్ సీన్ ను ముందుగా తీసేయ్ అని నాగార్జునకు చెప్పారు అక్కినేని. దీనిని బట్టి నటన గురించి.. సినిమా గురించి ఎంతలా తపిస్తారో అర్థం చేసుకోవచ్చు.. అందుకనే.. అక్కినేని ఎప్పటికీ మన గుండెల్లో బ్రతికే ఉంటారు.. #ANRliveon
నాగార్జున 2 కోట్లు విరాళం..
- వేలాది మంది చదువుకోవాలన్నది నాన్న కోరిక..
- ఏఎన్ఆర్ కళాశాల 75 వసంతాల వేడుకల్లో నాగార్జున
- మనుషుటు శాశ్వతం కాదు… పనులే శాశ్వతం..
గుడివాడ, ఆంధ్రప్రభ : తాను చదువుకోకపోయినా వేలాది మంది చదుకోవాలన్నది నాన్న (అక్కినేని నాగేశ్వరరావు) కోరిక అని సినీ హీరో అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. ఏఎన్ఆర్ కళాశాల 75 వసంతాల వేడుకలలో భాగంగా రెండవ రోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అక్కినేని నాగార్జున ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 సంవత్సరాల వేడుకల్లో పాల్గొనటం సంతోషంగా, చాలా గర్వంగా ఉందన్నారు. మనుషులు శాశ్వతం కాదని.. వారు చేసే పనులు శాశ్వతమని నాన్న నాగేశ్వరరావు నిరూపించారని తెలిపారు. చదువు ద్వారా వేలాది మందికి బంగారు భవిష్యత్ ఇవ్వాలని నాన్న కోరుకున్నారని తెలిపారు. 1950వ సంవత్సరంలో ఏఎన్ఆర్ కళాశాలకు నాన్న లక్ష రూపాయల డొనేషన్ ఇచ్చారని.. ఆ సమయంలో నాన్న గారు సినిమాకి కేవలం రూ.5 వేల నుంచి 10 వేలు మాత్రమే తీసుకునే వారని, ఏఎన్ఆర్ కళాశాలకు లక్ష, ఆంధ్ర యూనివర్సిటీకి రూ.25 వేలు, మద్రాస్ యూనివర్సిటీకి రూ.25 వేలు విరాళం ఇచ్చినట్లు తెలిపారు. నాన్నకు చదువంటే ఇష్టమని, తాను చదువుకోలేకపోయినా పది మందికి బంగారు భవిష్యత్ కల్పించాలని ఆశించేవారని తెలిపారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్ బట్టు దేవానంద్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఎంపీ కావూరి సాంబశివరావు, యలమంచిలి శివాజీ, రామోజీరావు, పద్మనాభం, కైకాల సత్యనారాయణ లాంటి ఎందరో ఏఎన్ఆర్ కళాశాలలో చదువుకున్నవారేనని తెలిపారు. పలువురు దేశ, ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాత స్థాయిలో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఏఎన్ఆర్ కళాశాల మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించనున్నారని, దానిని రేవు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విచ్చేసి ప్రారంబిస్తారని, ఇది నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మేనేజ్మెంట్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తోడ్పాటునందించాలని కోరుతున్నట్లు తెలిపారు. నా తరపున, మా అక్క సుశీల తరపున, మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున ఈ కళాశాలలో ఒక స్కాలర్ షిప్ పెట్టాలని అనుకున్నామని, మా తల్లిదండ్రుల పేరిట రూ.2 కోట్లు ఇవ్వాలని అనుకుంటున్ననట్లు తెలిపారు.

దానికి సంబంధించి మేనేజ్ మెంట్ వారితో మాట్లాడి వెంటనే అందిస్తానని తెలిపారు. నాన్న ఎప్పుడో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారని, అంత కూడా ఇవ్వకపోతే బాగోదని, నా భార్య అమల ఇంటి నుంచి బయలుదేరే ముందే చెప్పారని, వట్టి చేతులతో వెళ్తున్నారా? ఏమైనా ఇస్తారా?” అని అడిగిందని తెలిపారు. రూ.2 కోట్లు డొనేషన్ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. మరోసారి నన్ను 75 వసంతాల వేడుకకు ఆహ్వానించిన కళాశాల మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ బట్టు దేవానంద్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం అక్కినేని నాగార్జునను పలువురు మనంగా సత్కరించారు.
