Gopireddy Srinivasa Reddy | కోటి సంతకాల సేకరణతో…

Gopireddy Srinivasa Reddy | కోటి సంతకాల సేకరణతో…

  • కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభం
  • నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం
  • డాక్టర్ గోపిరెడ్డి

Gopireddy Srinivasa Reddy | నరసరావుపేట, ఆంధ్రప్రభ : మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైయస్సార్ సిపి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన కనిపించిందని పల్నాడు జిల్లా వైయస్సార్ సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో ఇవాళ‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… మెడికల్ కళాశాల ప్రైవేటీక‌రణ విధానంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించినందునే కోటి సంతకాల సేకరణ విజయవంతమైందని అనటానికి నిదర్శనమన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 4.31 లక్షల సంతకాల సేకరణ జరిగిందని తెలిపారు. ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ఏడు నియోజకవర్గాల ఇన్చార్జీలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపారు.

అదేవిధంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ఎటువంటి వాహనాలు ఏర్పాటు చేయకుండా తరలిరావడం జరిగిందని, కేవలం ఒక్క ఫోన్ పిలుపుతోనే నాలుగు నుంచి ఐదువేల మంది ప్రజలు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. భయపడకుండా కార్యక్రమానికి హాజరయ్యారన్నారు.

ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో నిర్వహించిన ఈ అతిపెద్ద కార్యక్రమం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని, భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున నిలబడి పోరాటాలు చేస్తామని చెప్పారు. అధికార పార్టీ నిస్సిగ్గుగా, అహంకారంతో తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఒక నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ప్రజల తరఫున నిలబడి పోరాటాలు చేస్తామ‌న్నారు.

ఈ రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది ఓటర్లు ఉంటే కోటి సంతకాలు సేకరించడం సామాన్యమైన విషయం కాదని, ప్రస్తుత పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఇవి దొంగ సంతకాలని విమర్శలు చేస్తున్నారని, పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని, ప్రజలు ప్రతి చోటా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు పి పి పి మోడ్ లోఈ మెడికల్ కళాశాలను ఇస్తానని, దీనికి పార్లమెంటరీ ఉపసంఘం కూడా సిఫార్సు చేస్తుందని అబద్ధాలు చెబుతున్నాడని, ఒక్కటే అడుగుతున్నా… ఎక్కడైనా ఈ దేశంలో మెడికల్ కాలేజీలు పి పి పి మోడ్ నిర్వహించటం జరుగుతుందా ? అని గోపిరెడ్డి ప్రశ్నించారు.

ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్, చండీగఢ్ యూనివర్సిటీ , జిప్మర్ వంటి అనేక ప్రతిష్టాత్మక వైద్య విద్య సంస్థలు ఉన్నాయని, వీటన్నిటిలో పి పి పి మోడ్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రైవేటీకరణ వలన వైద్య విద్యార్థులు 50శాతం సీట్లు కోల్పోతున్నారని, బయటి దేశాలు ,రాష్ట్రాల్లో కోట్లు ఖర్చుపెట్టి చదవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులందరికీ వైద్య విద్యను ఉచితంగా అందించాలని, పేదలందరికీ ఉచిత వైద్యం అందించాలని సంకల్పించిన జగన్ మోహన్ రెడ్డి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొని వస్తే, కనీసం వీటన్నింటికీ కేవలం 5వేల కోట్లు ఖర్చు చేయలేక ఈ ప్రభుత్వం ఈ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయటం అన్యాయమన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంతో ఈ కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభమైందని సందర్భంగా హెచ్చరించారు.

21న వై ఎస్ జగన్ పుట్టినరోజు…

ఈనెల 21వ తేదీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నరసరావుపేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని డాక్టర్ గోపిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలో పండ్ల పంపిణీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం, అనాధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం, సుస్మిత ఆర్థో అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్ అండ్ న్యూరో విభాగాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నామని, ఈ మెగా వైద్య శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచిత ఎక్స్ రే పరీక్షలు, ఉచిత సర్జరీలు, ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించ‌నున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Leave a Reply