Demolished | గ్రామస్థుల ఆగ్రహం

Demolished | గ్రామస్థుల ఆగ్రహం

Demolished | పెనుకొండ రూరల్, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండల పరిధిలోని మావటూరు గ్రామంలో బస్సు షెల్టర్‌ను అర్ధరాత్రి అక్రమంగా కూల్చివేయడం పై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే బస్ సెంటర్‌ను కూల్చివేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు శనివారం ఉదయం పెనుకొండ, మడకశిర ప్రధాన రహదారి రోడ్డు పై బైఠాయించి ధర్నాకు దిగారు. మావటూరు గ్రామంలో సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడుతున్న బస్సు షెల్టర్‌ను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం అన్యాయమని గ్రామస్తులు మండిపడ్డారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఎండ, వానలకు తడిసి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కూల్చివేసిన బస్సు షెల్టర్‌ను తిరిగి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.

గ్రామ సర్పంచ్ నాగరాజు ఆధ్వర్యంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ప్రజా సమస్యల పై పాలకులు స్పందించాల్సిన అవసరం ఉందని, ప్రజల సౌకర్యాల్ని ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నిరసనకారులు అన్నారు. అధికార పార్టీకి చెందిన వారే ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం దుర్మార్గమని విమర్శించారు.
ఈ ధర్నా కారణంగా పెనుకొండ–మడకశిర ప్రధాన రహదారి పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. బస్సు షెల్టర్ పునర్నిర్మాణం పై స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply