ఏడు రోజులపాటు అరసవల్లి రథసప్తమి వేడుకలు…

  • పకడ్బందీ ప్రణాళికతో..
  • భక్తులకు సత్వర దర్శనమే లక్ష్యం
  • కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం బ్యూరో, ఆంధ్రప్రభ : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి మహోత్సవం ఈసారి ఏడు రోజుల పాటు (జనవరి 19 నుంచి 25 వరకు) అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. భక్తులకు సౌకర్య వంతమైన సుదర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా… కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు శుక్రవారం కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఏడు రోజుల పాటు దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రతి రోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలని, ఇందుకోసం ప్రధాన అర్చకులతో సంప్రదించాలని మంత్రి సూచించారు. క్యూ లైన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ఆన్‌లైన్ టికెట్లను క్యూ.ఆర్ కోడ్‌తో అందుబాటులోకి తెచ్చి, భక్తుల రద్దీని ఏడు రోజులకు విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

భద్రత, సౌకర్యాల విషయంలో రాజీపడవద్దని సమీక్షలో స్పష్టం చేశారు. ఆలయం, కొత్త సాంస్కృతిక మైదానం, నగరం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉండేలా పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్ సూచించారు. నిష్క్రమణ పాయింట్ వద్ద భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాలను అందించడంతో పాటు, కోవా వంటి నాణ్యమైన వైవిధ్య ప్రసాదాల పంపిణీపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించారు.

ఉప రాష్ట్రపతి ఏదో ఒక రోజు ఉత్సవానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున, అందుకు తగ్గట్టుగా ప్రోటోకాల్, భద్రతా ఏర్పాట్లు చేయాలని, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వాన పత్రాలు పంపాలని అధికారులు తీర్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, ఏడు రోజులు ఉత్సవాలు నిర్వహించడం ద్వారా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని తెలిపారు. ఉత్సవాల ప్రారంభం రోజున సూర్య నమస్కారాలు, శోభాయాత్రతో పాటు, ఆ ఏడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను కూడా నిర్వహించాలని ప్రతిపాదించారు.

కార్పొరేషన్ అధికారులు వెంటనే నగరాన్ని, ముఖ్యంగా జాతీయ రహదారిపై నుంచి అరసవల్లికి వచ్చే దారులను శాశ్వత ప్రాతిపదికన సుందరీకరించడానికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.

ఈ సప్తాహ సూర్య మహోత్సవం ద్వారా శ్రీకాకుళం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్వో లక్ష్మణ మూర్తి, ఆర్డీవోలు సాయి ప్రత్యూష, కృష్ణ మూర్తి, గణేష్, డీఎస్పీ వివేకానంద, అరసవల్లి ఈవో ప్రసాదరావు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply