Congress | రెండోసారి.. ప్రశాంత్ రెడ్డి..

Congress | రెండోసారి.. ప్రశాంత్ రెడ్డి..

Congress, నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కే. ప్రశాంత్ రెడ్డి (Prasanth Reddy) మరోసారి నియమితులయ్యారు. జిల్లా అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ, అవకాశం మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డిని వరించింది. 1975 మే 8న జన్మించిన ప్రశాంత్ రెడ్డి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. ఈయన తండ్రి వీరారెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ తరఫున అమరచింత ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా డీసీసీబీ చైర్మన్‌గా కూడా సేవలందించారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబంలో పెరిగిన ప్రశాంత్ రెడ్డి, తండ్రి అడుగుజాడల్లోనే 1992లో అమరచింత ఎన్‌ఎస్‌యు‌ఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.

జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టడంతో, ఆ సమయంలో కొద్దికాలం జిల్లా అధ్యక్షుడిగా ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. అనంతరం పార్టీ సూచన మేరకు తిరిగి దరఖాస్తు చేసుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రెండోసారి అధ్యక్ష పదవి దక్కింది.

ఈ సందర్భంగా నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కె. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే తమ లక్ష్యమని తెలిపారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేల సూచనలు, సలహాలను తీసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాను అన్నారు.

Leave a Reply