ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు

  • జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక

నల్గొండ (ఆంధ్రప్రభ) : ర్యాగింగ్ చేస్తే కళాశాల నుండి బహిష్కరణతో పాటు క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని, దీనివల్ల జీవితమే నాశనం కావచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందని మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఆమె శుక్రవారం స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్‌, ఆర్డీవో అశోక్ రెడ్డితో కలిసి కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మెంటర్లు, విద్యార్థులతో విడిగా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

విద్యార్థులు ర్యాగింగ్ జరగలేదని, స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నామని వివరించగా, కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ర్యాగింగ్ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని, అలాంటి చర్యలకు పాల్పడేవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు, మెంటర్ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఎలాంటి రికమండేషన్లు పనిచేయవని, విలువైన జీవితాన్ని విద్యార్థులు చెడగొట్టుకోవద్దని హెచ్చరించారు.

ఏవైనా సమస్యలు ఉంటే విద్యార్థులు జిల్లా యంత్రాంగానికి నేరుగా తెలియజేయాలని సూచించారు. వైద్య విద్యార్థులు తమ భవిష్యత్తు, సమాజ సేవపై దృష్టి పెట్టాలని, బాధ్యతతో ప్రవర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.

నల్గొండ వైద్య కళాశాల ర్యాగింగ్ అంశంపై సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ఇకపై ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని, ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ త్రిపాఠి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నారాయణ అమిత్‌, ఆర్డీవో అశోక్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, అధ్యాపక బృందం పాల్గొన్నారు.