మూడేండ్లు గడిచినా షరా మాములే…
మట్టి రోడ్డే శరణ్యం
చోద్యం చూస్తున్న అధికారులు, కాంట్రాక్టర్
మోత్కూర్, నవంబర్ 5 (ఆంధ్రప్రభ) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో మోత్కూర్ -రాజన్నగూడెం మెయిన్ రోడ్డు (Motkur-Rajannagudem main road) సుమారు 3 కి.మీ దూరం డబల్ బి టి రోడ్డుగా మార్చేందుకు గత ప్రభుత్వ హయాంలో మూడేండ్ల క్రితం రూ.5 కోట్ల 80 లక్షలు మంజూరు అయ్యాయి.ఈ రూట్లో కొంతమేరకు డబల్ బి టి రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన కాంట్రాక్టర్ బిల్లులు రావడం లేదని పనుల్లో నిర్లక్ష్యం వహించారు.దీంతో కొత్త కాంట్రాక్టర్ కి పనులు అప్పగించారు.

ఈ మూడేండ్లలో మోకాళ్ళ లోతు గుంతల్లో ఇటీవల మట్టి పోయడం తప్ప … బీటీ రోడ్డు నిర్మాణ పనులు మాత్రం కావడం లేదు. ఆర్ అండ్ బి అధికారుల పర్యవేక్షణ సైతం కరువ్వడం, కాంట్రాక్టర్ (contractor) ఇటు వైపుగా కన్నెత్తి చూడకపోవడంతో నిత్యం తొర్రూరు, సూర్యాపేట, యాదగిరి గుట్ట డిపోల కు చెందిన వందలాది బస్సులు, వాహనాల డ్రైవర్లు,కండక్టర్ లు,ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, బాలింతలు ఈ రూట్లో కేవలం 1కి.మీ న్నర దూరం గుంతల రోడ్డులో ప్రయాణం ఊగిసలాటలో నరక యాతనగా మారింది.

ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసినప్పటికి …పనుల్లో జాప్యంతో ప్రయాణికులు అధికారులు, కాంట్రాక్టర్ తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ రోడ్డు బి ఎస్ ఎన్ ఎల్ కార్యాలయం వద్ద లోతట్టుగా ఉండడంతో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఈ ప్రాంతం చెరువును తలపించింది. ఇప్పటికైనా ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు స్పందించి మోత్కూర్-రాయగిరి మెయిన్ రోడ్డు లో అసంపూర్తిగా ఉన్న బి టి రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

