ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం
ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : భావితరాలకు స్ఫూర్తి అందించేలా ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్స్ ను ఏర్పాటు చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట ఎన్టీఆర్ సర్కిల్ ఆధునీకరణ పనులను శనివారం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఎన్టీఆర్ సర్కిల్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే వెస్ట్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటు సన్నహాలు మొదలైనట్లు తెలిపారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ… విజయవాడలో ఎన్టీఆర్ సర్కిల్ అంటే పటమట సెంటర్ మాత్రమే గుర్తు వస్తుందన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ తో పాటు ఎన్టీఆర్ విగ్రహానికి మరిన్ని హంగులు తీసుకువచ్చేందుకు ఒక డిజైన్ అప్రూవల్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్, రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, శాలివాహన కుమ్మరి సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ మైలవరపు పీరుబాబు కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, దేవినేని అపర్ణ, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, టిడిపి నాయకులు యెర్నేని వేదవ్యాస్, పడాల గంగాధర్, గద్దె రమేష్, గరికపాటి బద్రి, కొత్తపల్లి రమేష్ పాల్గొన్నారు.

