పునరావాస కేంద్రాలకు తరలింపు

పునరావాస కేంద్రాలకు తరలింపు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో : ఆంధ్రప్రభ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నెరు నది నీరు ఉధృతి పెరిగింది. మున్నేరు నదిలో నీరు ఒక్కసారిగా 24 అడుగులతో నీరు ప్రవహిస్తోంది. గంట గంటకు పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నిన్న అర్ధ రాత్రి నుండి ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. రాత్రి 9 గంటల సమయంలో ఖమ్మం కాల్వ ఒడ్డు వద్ద 19 అడుగులతో ప్రవహించిన మున్నేరు అర్ధరాత్రి 24 అడుగులకు చేరడంతో మోతి నగర్, బోక్కల గడ్డ, వెంకటేశ్వర నగర్ కాలనీ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. వరద ఉధృతి మరింతగా పెరిగే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. ఖమ్మం నగరంలోని పది డివిజన్లకు, పాలేరు నియోజకవర్గం లోని ఖమ్మం రూరల్ మండలంలో పలు గ్రామాలకు మున్నేరు వరద ముంపు పొంచి ఉంది. జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు స్వయంగా ప్రజలను కలుస్తూ పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ అనుదీప్ ఈ రోజు ఉదయం పరిశీలించారు. అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.


