మ‌రో రెండు రోజులు సేమ్ సీన్‌..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : కొన్ని రోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఎగువ నుంచి వ‌స్తున్న వ‌ర‌ద కార‌ణంగా హైదరాబాద్ (Hyderabad)లో మూసీ (Musi) నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మూసీనది పరివాహక ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాన్‌స్టాప్‌గా వర్షాలు (rains) కురవడంతో వాహనదారులు, ఆఫీసులకు వెళ్లేవారు, అనేక పనుల కారణంగా బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. అయితే ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలకు మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్​పుర్​ తీరాన్ని శనివారం ఉదయం దాటింది. ఇది దక్షిణ ఒడిశా ఛత్తీస్​గఢ్ ప్రాంతంలో ఆదివారం తీవ్ర అల్పపీడనం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు.

ఇవాళ (ఆదివారం) తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి, వరంగల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, మెదక్, జగిత్యాల, సిరిసిల్లా, నిజామాబాద్ , నారాయణపేట, జనగాం, జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

హైద‌రాబాద్‌లో..
హైదరాబాద్ మహా నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల పాటు సిటీ వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వరద ముంపు ప్రాంతాలు, వరద పరిస్థితులను, వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తుండాలని ఆదేశించారు.

ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల మరో రెండు రోజులు పాటు ఏపీ వ్యాప్తంగా పలు చోట్లు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తా జిల్లాలు, అలాగే రాయలసీమలో కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపు ఎన్టీఆర్‌, ఏలూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Leave a Reply